న్యాల్కల్, ఏప్రిల్ 29: మంజీరా తీరాన తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలోని గరుడ గంగ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తున్నది. శనివారం స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి అర్చక పురోహితులు పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీసాయిబాబా, వేంకటేశ్వస్వామి, సూర్యభగవన్, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షేత్రం ఆవరణలోని యాగశాలలో పురోహితులు చండీ హోమం, పూర్ణాహుతి, హారతి తదితర పూజలు చేశారు. ఈ కుంభమేళాలో మంజీరా నదిలో పుణ్య స్నానాలను ఆచరిస్తే పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తమ కుటుంబ సభ్యులతో భారీగా తరలివచ్చారు. మహిళలు, యువతీ, యువకులు పుణ్యస్నానాలు చేసి సూర్యుడికి జలాభిషేకం చేశారు. మంజీరా నదిలో మహిళలు దీపాలను వదలడంతోపాటు గంగమ్మతల్లికి చీర, సారె, గాజులతో వాయినాలను ఇచ్చుకున్నారు. మరి కొందరు భక్తులు నదీ తీరంలో పితృకర్మల్లో భాగంగా పిండ ప్రదానం చేశారు.
ఉత్తరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాగసాధువులు, దిగంబర సాధువులు, స్వామీజీలు భాజాభజంత్రీల హోరు, భజన కీర్తనల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా మంజీరా నదికి తరలివెళ్లి అమృత స్నానాలను ఆచరించారు. పంచవటీ క్షేత్ర ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి ఆధ్వర్యంలో పురోహితులు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకు మహాహారతి ఇచ్చి కీర్తనలు ఆలపించారు. ఈ కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహా గంగహారతిని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులతో నదీ తీరం నిండిపోయింది. గంగామాత ఆలయ సమీపంలోని ధ్వజస్తంభం వద్ద నాగసాధులు, సంతులు, భక్తులు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబాతో పాటు పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు. ఝరాసంగం మండలంలోని కప్పానగర్ మల్లన్న గుంట పీఠాధిపతి మల్లయ్యస్వామి భక్తులకు ప్రవచనాలు ఇచ్చారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అక్కమహాదేవి భజన మండలి సభ్యులు, చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఏర్పాట్లపై అధికారుల దృష్టి..
మంజీరా కుంభమేళాకు భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని వసతులు కల్పించడంపై దృష్టి పెట్టారు. పంచవటీ క్షేత్రం సాధువుల, భక్తులకు ఏర్పాటు చేసిన షామియానాలు, తాగునీరు, స్నాన ఘట్టాలు, షవర్లు, మరుగుదొడ్లను సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు ఆయా పరిసర ప్రాంతాలను సందర్శించి శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల కుంభమేళాకు వచ్చేందుకు జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక చెందిన బస్సులను నడుపుతున్నారు. భక్తులు నదిలోతు ప్రాంతంలోకి వెళ్లకుండా తీరంవెంట గజఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్లను నియమించడంతో పాటు స్నాన ఘట్టాల సమీపంలో కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్ఐ వినయ్‌కుమార్ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.