సిద్దిపేట, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెవెన్యూ కార్యాలయాల్లో రోజు రోజుకూ అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల్లో ఫేక్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన భూములను ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసి కోట్ల రూపాయాలు సొమ్ముచేసుకుంటున్నారు. తహసీల్ కార్యాలయాల్లో జరిగే భూ రిజిస్ట్రేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లు కీ రోల్ పోషిస్తున్నారు.అవినీతి, అక్రమాలపై తహసీల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నా, రెవెన్యూ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడి నిరుపేదల రక్తం తాగుతున్నారు.
అమాయక రైతుల భూములు కాజేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో చోటు చేసుకున్న సంఘటనలో పెద్దల హస్తం ఉందని తేలింది. దీని వెనుక ఓ రాజకీయ నేత బినామీ పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు దళారులతో కుమ్మక్కై అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న భూములతో పాటు జాతీయ రహదారుల పక్కన ఉన్న భూములను టార్గెట్ చేస్తూ భారీగా ఫేక్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. వర్గల్ ఘటన సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కంప్యూటర్ ఆపరేటర్లు, తహసీల్దార్లు, దళారులు కలిసి అమాయ రైతుల భూములను కాజేస్తున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 15 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొంతమంది రింగ్ అయి తహసీల్దార్ల కనుసన్నల్లో ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దళారులతో కంప్యూటర్ ఆపరేటర్లు, తహసీల్దార్లు కుమ్మక్కు?
భూభారతి చట్టం ద్వారా భూముల రికార్డులు సులవుగా అవుతాయని ఆశించిన రైతులకు, ఇప్పుడు అదే వ్యవస్థ కష్టాలను తెచ్చిపెడుతున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అనేక మండలాల్లోని తహసీల్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఫేక్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు కేసులు వెలుగుచూస్తున్నాయి. దీనిపై జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. విలువైన భూములను దళారులు కొట్టేస్తున్నారు. తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు దళారులతో కుమ్మక్కై భూభారతి పోర్టల్‌లో భూ రికార్డులను సులభంగా మారుస్తున్నారు.
ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. అసలు యజమాని తెలియకుండానే ఫేక్ సంతకాలతో పేర్లు మారిపోవడం, పాత పత్రాలు కనబడకుండా పోవడం జరుగుతున్నాయి. దీంతో అసలైన భూ యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ తతంగంలో కంప్యూటర్ ఆపరేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు సిస్టమ్ యాక్సెస్‌ను దుర్వినియోగం చేస్తూ డేటా మారుస్తున్నారు. కొందరు మధ్యవర్తులతో కలిసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. దీని వెనకాల అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్లను ముందుంచి తహసీల్దార్లు దందా సాగిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవ్వడానికి తహసీల్దార్ల ఆమోదం అవసరం. కానీ, సరైన పరిశీలన లేకుండా ఫైళ్లు చకచకా క్లియర్ అవుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వక చర్యలా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు కొన్ని కేసుల్లో నకిలీ ఆధారాలతో భూములు రిజిస్టర్ అయ్యాయి. అసలు యజమానులు కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతున్నారు. భూభారతి చట్టం ద్వారా పారదర్శకత పెంచాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది.
గౌరారం పట్టా మార్పిడిలో ట్విస్ట్
వర్గల్, మే 5: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని సర్వేనంబర్ 132లోని భూమిని పట్టాదారుడు లేకుండానే, ఇతరుల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు విచారణ జరిపి వర్గల్ తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, సంబంధిత భూమి తనదేనని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎలువాక రాజయ్య అనే వ్యక్తి మంగళవారం మ్యుటేషన్ పత్రాలతో వర్గల్ తహసీల్ కార్యాలయం వద్ద ప్రత్యేక్షమయ్యాడు. 2010లో 132 సర్వేనంబర్‌లో 2.28 ఎకరాల భూమిని విజయభాస్కర్‌రెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు అతడు తెలిపాడు. మ్యుటేషన్ కోసం గతంలో వర్గల్ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదన్నారు. తన భూమి ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్ అయ్యిందన్న సమాచారం మీడియాలో చూసి తహసీల్ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన తెలిపాడు. భూ సమస్యపై అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. కాగా, ఆ భూమి తమదేనని, తమకు తాతల కాలంలో ఇనాంగా ఇచ్చారని గ్రామానికి చెందిన వడ్ల కమ్మరి వాళ్లు తెలిపారు.
ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు