ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి అత్యంత కీలకమైన జాతీయ రహదారి 44పై ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు నిత్యం లక్షలాది సంఖ్యలో వాహనాలు సాగించే ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు రెండున్నరేండ్లుగా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కారిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు గడువు ముగిసినా.. పూర్తి కాలేదు. కొద్ది రోజుల కిందట నత్తనడకన జరిగి ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకెన్నాళ్లీ ఫ్లైఓవర్ నరకం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2026 జూన్ నాటికి పనులు పూర్తి కావాలని గడువు ఇచ్చినా ఇప్పటికింకా 50 శాతం పనులు పూర్తికాలేదు.
– మేడ్చల్, జూలై 31 (నమస్తే తెలంగాణ)
మేడ్చల్, జూలై 31 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారి- 44 జాతీయ రహదారి మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు రెండు వేర్వురు ప్రాజెక్టులు హెచ్ఎండీఏ, నేషనల్ హైవే అథారిటీ ఆధ్యర్వంలో జరుగుతున్నాయి. ప్యారడైజ్ బోయిన్పల్లి మీదుగా డెయిరీ ఫామ్ వరకు ఫ్లైఓవర్ 5. 32 కిలోమీటర్లకు రూ. 1,487 కోట్ల వ్యయం కాగా.. రెండో ప్రాజెక్ట్ సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ 6 లైన్ల ఫ్లైఓవర్‌తో అండర్ పాస్‌ల నిర్మాణాలకు రూ. 492 కోట్లు మంజూరయ్యాయి. 2022లో ప్రారంభమైన ఈ పనులు మొదట్లో 2024 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పూర్తికాకపోవడంతో తిరిగి తుది గడువును జూన్ 2026 వరకు పొడిగించారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు చుక్కలు చూస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు నిధుల విడుదల ఆలస్యం కావడం వల్లే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సుచిత్ర నుంచి మేడ్చల్ వరకు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో పనులు అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మరో కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, మరొక కాంట్రాక్టర్ వచ్చే వరకు ఫ్లైఓవర్ పనులు జరిగే అవకాశం లేకుండా పోయిందని అధికారుల ద్వారా తెలుస్తోంది.

2022 ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లు మొదట 2024 సంవత్సర చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా 2026 జూన్ వరకు గడువు ఇచ్చినా పనులు పూర్తి చేయాని కాంట్రాక్టర్ల, బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే ప్రభుత్వ, నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యం చేసే పనులు పూర్తికావడానికి మరో గడువు ఇవ్వాల్సి వస్తుందన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిధుల కొరతకు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని, కాంట్రాక్టర్లకు జరిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణ పనులు అరకోరగా సాగుతున్న నేపథ్యంలో రహదారిపై తవ్విన గుంతలు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. అత్యవసర సమయంలో వెళ్లే అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. మరోవైపు దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం వీడి యుద్ధ్ద ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు నిలిచిన ఆరు లైన్ల ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేచ్చేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పనులు ప్రారంభించేలా దశల వారీగా పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులోభాగంగానే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నారు.
బోయిన్పల్లి నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి. ఫ్లైఓవర్ నిలిచిన నిర్మాణ పనులను ప్రారంభించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే మహాధర్నా నిర్వహించనున్నాం. మూడేండ్ల కిందట ప్రారంభమై గడువు పూర్తయినా.. పనులు పూర్తికాలేదు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితికి వచ్చింది. కాంట్రాక్టర్ల, అధికారుల నిర్లక్ష్యం మూలంగా గడువు పూర్తయినా పనులు పూర్తి కాలేదు. పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం.