హుస్నాబాద్, జూలై 31: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు… వరద పారదు’ అన్నట్లుగా ముసురు అలుముకున్నది. కానీ, భారీ వాన పడడం లేదు.వరద పారడం లేదు. దీంతో చెరువులు, కుంటలు నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పంటలు సాగుచేసి సస్యరక్షణ చర్యల్లో నిమగ్నం కావాల్సిన రైతులు, కనీసం విత్తనాలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొంతమంది రైతులు ముసురుతో పొలం దున్నుతూ నాట్లు వేసుకుంటున్నారు. ఇప్పటికీ కొందరు రైతులు ఆరుతడి పంటల సాగు మొదలుపెట్టక పోవడం గమనార్హం. చెరువులు, కుంటల్లోకి నీళ్లు రాక రైతులు పంటలు సాగుకు ముందుకు రావడం లేదు. గతేడాది జూలై నెలాఖరుకు వరి, పత్తి పంటలతో పాటు ఇతర పంటల సాగు సంపూర్ణంగా జరిగింది. కానీ, ఈసారి చాలాచోట్ల సాగుభూములు బీళ్లుగా కనిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో గతేడాది జూలైలో 20.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. అప్పుడు భారీ వర్షాలు పడటం వల్ల చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. కానీ, ఈసారి జూలైలో కేవలం 17.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది కేవలం ముసురుతో కూడుకున్న వర్షం కావడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం లేదు. గతేడాది జూలైలో అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 230.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఏడాది జూలైలో అత్యధికంగా మద్దూరు మండలంలో 190.6 మి. మీటర్ల వర్షం పడింది. డివిజన్లోని ఆరు మం డలాల్లోనూ ఇంకా చెరువుల్లోకి నీరు చేరలేదు.
ముసురుతో హుస్నాబాద్ ప్రాంతంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా తయారయ్యాయి. ముఖ్యంగా మట్టిరోడ్లలో నడవలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం పడితే బురద మొత్తం కొట్టుకుపోయేది. గ్రామాల్లోని డ్రైనేజీల్లో కూడా వరద లేక చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలతో ప్రజలు సతమతమవుతున్నారు. వాహనదారులు, పాదచారులు రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా ముసురు పడుతుండటంతో దుకాణదారులు, వివిధ పనులు చేసుకునేవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఆటంకంగా మారింది.