నర్సాపూర్ : ప్రతి గ్రామంలో దసరా సంబురాలు కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం గ్రామస్తులు దసరా పండుగకు దూరంగా ఉన్నారు. దసరా పండుగ కోసం కొత్త బట్టలు కొన్నారు. పిండి వంటలు చేసుకున్నారు. ఆడబిడ్డలను పిలుచుకున్నారు. దసరా వంటలు కూడా పూర్తయ్యాయి. తీరా పాలపిట్టను చూద్దామని బయలుదేరే సమయానికి విషాదం జరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఓ మహిళ అనారోగ్యంతో మృత్యువాత పడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పురోహితునికి తెలియజేయగా.. కొత్త బట్టలు వేసుకోవద్దని, జమ్మిచెట్టును తాకరాదని, దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టవద్దని సూచించారు. పురోహితుడి సూచన మేరకు గ్రామస్తులు దసరా పండుగకు దూరంగా ఉన్నారు.