సిద్దిపేట అర్బన్, జూన్ 3: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట అని, 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేట అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో మాజీమంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, దుబ్బాక ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..కొన్ని దశాబ్దాల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ కలను నిజం చేసింది బీఆర్ఎస్ అన్నారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. ఉద్యమంలో సిద్దిపేట మట్టిబిడ్డలు రాష్ట్రస్థాయిలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమ సమయంలో నందినిసిధారెడ్డి, రమణాచారి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేవీప్రసాద్, రామలింగారెడ్డి సేవలు మరువలేనివన్నారు. వారిని గుర్తించుకోవడం మన కర్తవ్యమన్నారు. ఉద్యమంలో నిస్వార్థంగా సేవచేసిన వారిని గుర్తించుకోవడం నిజమైన పండుగ అన్నారు. తెలంగాణ ఉద్య మం చాలాసార్లు విఫలమైందని.. కానీ ఉద్యమానికి, కేసీఆర్‌కు సిద్దిపేట మట్టిబిడ్డలు కుడి భుజంగా నిలిచారన్నారు. ఉద్యమకారులున్న ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందని.. కరెంట్ కోసం రాజీవ్ రహదారిని దిగ్భందం చేశామని.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయన్నారు. అరెస్ట్ అయినా.. జైల్లో ఉన్నా బాధపడింది, భయపడింది లేదన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ హరీశ్‌రావు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆశలు, పదవుల ఆశలు లేకుండా నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పాల్గొన్నారని.. వారిని సన్మానించుకోవడం మన కర్తవ్యమన్నారు. కూడవెల్లి, హల్దీ వాగుల్లో నీళ్లు ఎండిపోగా.. కేసీఆర్ బస్సుయాత్ర చేయగాని నీళ్లు వచ్చాయన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను శాలువా, మెమోంటోతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు విరాహత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు ఎంతో కష్టపడి పని చేశా. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యమకారులను సన్మానించుకోవడం ఎంతో గౌరవం. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఉద్యమకారులను గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని బీఆర్ఎస్ నాయకులు కొనసాగించాలి.
రేవంత్‌రెడ్డి సీఎం అయితే కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు ఎప్పటికీ కాలేడు. సిద్దిపేటలో ఉండి తెలంగాణ కోసం పోరాడిన ఒక ఉద్యమకారుడి పాద ధూళికున్న విలువ కూడా రేవంత్‌కు లేదు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎంతోమంది ప్రాణాలను తీసింది కాంగ్రెస్ పార్టీయే. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు, దేశంలో లౌకిక విలువలను, మత సామరస్యాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశాం.
14 ఏండ్లు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ గురించి అనేకమంది చాలా రకాలుగా మాట్లాడినా.. ఎవరికీ సాధ్యం కాలేదు. కేవలం కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఉద్యమంలో నిస్వార్థంగా సేవ చేసిన వారిని గుర్తించుకోవడం నిజమైన పండుగ. తెలంగాణ ప్రజలు వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
తెలంగాణ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గడ్డ సిద్దిపేట. ఇలాంటి గడ్డమీద హరీశ్‌రావు చేతుల మీదుగా ఉద్యమకారులకు సన్మానం చేయడం అదృష్టం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరూ ఐకమత్యంగా పోరాడాలి. రాష్ట్ర సాధనలో ఎందరో ఉద్యమకారులు బలిదానమయ్యారు. వారి త్యాగం మరచిపోలేనిది.
శాంతియుతంగా ఎంతో నిబద్ధతతో పోరాడి తెలంగాణ సాధించామో.. అంతే నిబద్ధతతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి ఉద్యమానికైనా ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
1969లో ఉద్యమాలు చేశాం. నాడు తెలంగాణ అంటేనే జైల్లో పెట్టే పరిస్థితులు ఉండే. 1996లో సిద్దిపేట లో మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ ఆవశ్యకతను వివరించాం. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట గడ్డ రక్షణ కవచంగా నిలిచింది. 14ఏండ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.