పటాన్చెరు, సెప్టెంబర్, 16: మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్‌కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలుచేసే ధైర్యం సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.
బీసీ బంధు రెండో విడత, మైనార్టీ బంధు మొదటి విడత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. జీవో 58, 59 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరుగుతున్నదన్నారు. మొన్న ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు, నిన్న పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా బీసీ బంధు, మైనార్టీ బంధు కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్న సర్కారు తమదన్నారు.
సీఎం కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. నిరంతరం కరెంట్ ఉండడంతో పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి వరంలా మారిందన్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో 2 వేల మెగావాట్ల వినియోగం ఉంటే ఇప్పుడు 6వేల మెగావాట్ల విద్యుత్ వాడుతున్నామన్నారు. ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ర్టాలకంటే హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం అధికంగా ఉందన్నారు.
పటాన్‌చెరుపై సీఎం కేసీఆర్ వరాలు
సీఎం కేసీఆర్ పటాన్చెరు ప్రాంతంపై వరాలు కురిపించారని గుర్తుచేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడున్నారని గ్రహించే భారీగా నిధులు ఇచ్చారన్నారు. అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు, పటాన్చెరు, భారతీనగర్, ఆర్సీపురానికి రూ.30 కోట్లు ఇచ్చారన్నారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేశారన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి హాట్రిక్ విజయం ఇవ్వాలని మంత్రి కోరారు. పటాన్చెరును సీఎం కేసీఆర్ ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేశారన్నారు. సబ్ రిజిస్టేషన్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల మంజురైందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 170 దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ మళ్లీ రావాలి: మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ
బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రావాలని మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ కోరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను మరోమారు భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు అండదండలో చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నిరంతరం ప్రజాసేవలోనే ఉంటున్నారన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్‌కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, తుమ్మల పాండు రంగారెడ్డి, కొలన్ రోజా బాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, పుష్పా నగేశ్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, శ్రీధర్‌చారి, కొలన్బాల్రెడ్డి, చంద్రారెడ్డి, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి, ఉపేందర్ ముదిరాజ్, యూనూస్ పాల్గొన్నారు.
అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
నిరంతరం అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గానికి అనేక వరాలు ఇచ్చారన్నారు. పటాన్చెరు మినీ ఇండియా అన్నారు. అన్ని రాష్ర్టాల ప్రజలు పటాన్చెరులో ఉంటున్నారన్నారు. వారికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో 28వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు. స్థానికులకు 2800 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేలా కేటాయించేలా మంత్రి హరీశ్‌రావు చూడాలని వినతి చేశారు.