సిద్దిపేట, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తీర్పుతో తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు రెండు వారాలు గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేయండతోఎన్నికలు ప్రక్రియ నిలిచిపోనున్నది. కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తొలి విడత నామినేషన్లను స్వీకరించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా, సర్పంచ్ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సిద్ధమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలో తొలి విడత ఎన్నికల జరుగనున్న 15 జడ్పీటీసీ స్థానాలకు 7నామినేషన్లు దాఖలయ్యాయి. 125 ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత జరుగనున్న 12 జడ్పీటీసీ స్థానాలకు 1 నామినేషన్ దాఖలైంది. 129 ఎంపీటీసీ స్థానాలకు 1 నామినేషన్లు దాఖలైంది. మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత జరుగనున్న స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలకు 8, ఎంపీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి ఎన్నికల కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు నడుచుకోనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. 42 శాతం రిజర్వేషన్లపై కావాలనే రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడిందని వారు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతూ, ఎన్నికలు నిర్వహించే సత్తాలేక మోసం చేస్తున్నదని వారు మండిపడ్డారు. లీగల్‌గా చెల్లుబాటు కాదని తెలిసి రేవంత్ సర్కార్ బీసీలతో ఆడుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు బీసీలకు ఏదో చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తన బుద్ధ్దిని తేటతెల్లం చేసుకుంది.
బీసీలకు ఇస్తామన్న 42 శాతం హామీని తుంగలో తొక్కిందని బీసీ నాయకులు మండిపడుతున్నారు. న్యాయ స్థానంలో జీవో నిలబడదని చెప్పి ఇన్నాళ్లు డ్రామాలు ఆడి బీసీలకు అన్యాయం చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలంటే 10వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడింది. పైగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42శాతం అంటూ శాసనసభ ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకుంది. తాజాగా బీసీలను స్థానిక ఎన్నికల ముందు బోల్తా కొట్టించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుదామని ఆశగా ఎదరు చూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. కొంత కాలంగా కోర్టు తీర్పు కోసం ఎదరు చూసిన జనరల్ కేటగిరీ ఆశావహుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. ఇన్నాళ్లు తమ పరిస్థితి ఏంటని అనుకున్న తరుణంలో కొంత ఉపశమనం కలిగిందని వారు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇష్టారీతిగా తీసుకున్న నిర్ణయాలతో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవువుతున్నాయని వారు ఆరోపించారు.
గతానికి భిన్నంగా రిజర్వేషన్లను పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి. గతంలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించి సీట్లు కేటాయించారు.తాజాగా 42 శాతం కల్పించి సీట్లు కేటాయించడంతో మిగతా వర్గాలు ఆందోళన చెందాయి. బీసీ రిజర్వేషన్లలో గతానికి ఇప్పటికి 19 శాతం బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయి.దీంతో జనరల్ స్థానాల్లో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల స్థానాలకు కోత పడింది. ప్రస్తుతం కోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడంతో జనరల్ కేటగిరీ వారు ఊరట చెందారు. తదుపరి రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయి అనే అంశాలపై చర్చ జరుగుతున్నది.
సంగారెడ్డి, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం గురువారం ఉదయం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న 12 మండలాల్లో మధ్యాహ్నం వరకు కొంత హడావిడి కనిపించింది. 12 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం ఉదయం నుంచి ఎంపీడీపీవో కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు ఇవ్వడంతో పాటు నామినేషన్లు స్వీకరణ ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్‌పై హైకోర్టు తీర్పు మధ్యాహ్నం ఉండడంతో నామినేషన్లు వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
ముఖ్యంగా రాజకీయపార్టీలకు చెందిన ఆశావహులు, అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఎంపీడీవో కార్యాలయాల వద్ద సందడి కనిపించలేదు. స్వతంత్ర అభ్యర్థులు కొంత మంది నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు ఆసక్తి చూపారు. రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఆశావహులు కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోలేదు. సాయంత్రం హైకోర్టు బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. ఎన్నో నెలలుగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోని స్థానిక నేతలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు చేపట్టడంతో పాటు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్, నోటిఫికేషన్ జారీచేసింది.
స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేయడంతో స్థానిక సంస్థల ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం తీరును బీసీ సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు సైతం తప్పుబడుతున్నారు. 42శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని బీసీ సంఘాలు, బీసీ నేతలు కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు చర్యలతో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని బీసీ నేతలు మండిపడు తున్నారు.