సిద్దిపేట, ఏప్రిల్ 12: పద్నాలుగేండ్ల పోరాటం… ఉద్యమ పంథా.. చరిత్ర ఉన్న గులాబీ జెండాకు పురుడు పోసిన గడ్డ సిద్దిపేట అని, 25 ఏండ్ల ఘనకీర్తి సిద్దిపేట మట్టి బిడ్డలకే ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ జనసమీకరణపై సిద్దిపేట పట్టణం, చిన్నకోడూరు మండలాల శ్రేణులతో శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 27న పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పల్లె పల్లెనా జెండా ఎగురాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జెండా గులాబీ జెండా అని అన్నారు.
మళ్లీ కేసీఆర్ కావాలి… రావాలంటున్న జనం
కేసీఆరే కావాలి.. మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, కేసీఆర్ పాలనను ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ అభివృద్ధిలో పయనించిందన్నారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అన్నారు. 24 గంటల కరెంట్, రూ.2 వేల పింఛన్, రైతుబంధు, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి పథకాలు, కార్యక్రమాలకు కేసీఆర్ కేరాఫ్ అని, కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. వచ్చేది మళ్లీ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని జోస్యం చెప్పారు.
హైడ్రా పేరుతో పేదోళ్ల ఇండ్లు ధ్వంసం చేయడం, అడవులు ధ్వంసం చేసి మూగజీవాలను ఆగంచేయడం వంటి పనులకు రేవంత్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అన్నీ బంద్ చేసిన రేవంత్ పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రజల కేసీఆర్ మళ్లీ రావాలి..
కావాలి అని కోరుతున్నారని హరీశ్‌రావు అన్నారు. నూకలు మిరే తినుండ్రి అన్న కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ నాటి మాటలు నేడు రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పేరుతో 40శాతం నూకలు ఇచ్చి ప్రజలకు తినిపించి నిజం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పి నూకల బియ్యం ఇచ్చిన దౌర్బాగ్య సీఎం రేవంత్ అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు ఇచ్చి ఎంత స్పీడ్‌గా వచ్చిందో.. ఎన్నికల తర్వాత ఎగవేతలతో అంతే స్పీడ్‌గా గ్రాఫ్ పడిపోయిందన్నారు.
కొడంగల్ నుంచి వెటర్నరీ కళాశాల తెచ్చుకునుడే..
సిద్దిపేట అభివృద్ధి కక్ష సాధింపుపై అసెంబ్లీలో మాట్లాడానని, నిధులు వచ్చేవరకు కొట్లాడుతానని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 15 నెలలుగా అభివృద్ధికి గ్రహణం పట్టిందని, ఆగిపోయిన పనులు తెచ్చేవరకు నిద్ర పోను అని అన్నారు. సిద్దిపేట అభివృద్ధి పనులు ఆపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో వెటర్నరీ కళాశాల మంజూరైతే కొండగల్కి తరలించుకు పోయారని, మళ్లీ మా ప్రభుత్వం రాదా.. వచ్చిన రోజునే అదే కొడంగల్ నుంచి మళ్లీ సిద్దిపేటకు వెటర్నరీ కళాశాల తెస్తానన్నారు.
సిద్దిపేటలో శిల్పారామం, నర్సింగ్ కళాశాల, చివరి దశకు వచ్చిన వెయ్యి పడకల దవాఖానలో క్యాన్సర్, గుండె విభాగాలకు సంబంధించిన పనులు ఆపివేశారన్నారు. మున్సిపల్లో రూ.20 కోట్ల రోడ్డు పనులు ఆపారని, సిద్దిపేట మీద ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాముని శ్రీనివాస్, ముల్కల కనకరాజు, కుంటయ్య, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గుండు భూపేశ్, మోహన్‌లాల్, బూర మల్లేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.