వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుండడంతో తెలంగాణ దక్షిణ భారత దేశ ధాన్యాగారంగా మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం మద్దతు ధరతో సేకరించి రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం ఉంటే, తెలంగాణలో 7.8 శాతం ఉన్నదని, అన్ని రంగాల్లో మన రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలిచిందని తెలిపారు. కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీటీ, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి ఇటీవల సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారని, ఆ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో రోల్‌మోడల్‌గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితా వేణుగోపాల్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పొద్దుతిరుగుడు విత్తనాలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పొద్దుతిరుగుడు సాగు పెరిగిందన్నారు. ఈ యేడు 6200 ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేశారన్నారు. రాష్ట్రంలో మొదటి పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్దిపేటలో ప్రారంభమైందని, రూ.6400 మద్దతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని చెప్పారు.
జిల్లాలో 60 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంట పండుతోందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, 6 వేల మంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ వచ్చాక రైతుకు భరోసా దొరికిందని, కేంద్రం వడ్లు కొనమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని రైతులకు సహకారం అందించిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో యాసంగిలో 10 లక్షల ఎకరాలు కూడా సాగయ్యేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాసంగిలో 53 లక్షల ఎకరాల వరి సాగవుతున్నదన్నారు. దేశంలోని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు భౌగోళికంగా చాలా పెద్దవైనా ఆ రాష్ర్టాల్లో వరిసాగు కావడంలేదని చెప్పారు. ఆనాడు తెలంగాణలో పని దొరుకక ఉండేవారని, ఇవాళ 16 రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నీళ్లు ఫుల్, చేపలు ఫుల్, కరెంట్ ఫుల్, పంటలు ఫుల్ అని.. మండుటెండల్లో చెరువులు, చెక్‌డ్యాంలు, వాగులు నిండుగా నీళ్లతో ఉన్నాయని.. అన్ని వర్గాల ప్రజలకు పని లభిస్తుందని మంత్రి ధీమాగా చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రామచందర్, 1వ వార్డు కౌన్సిలర్ రెడ్డి విజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.