సిద్దిపేట, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మహిళా సంఘాలు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని రై తుల నుంచి సేకరించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 416 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో మం త్రి తన్నీరు హరీశ్‌రావు అధ్యక్షతన సమావేశం కానున్నారు. మంత్రి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
జిల్లాలో మూడో వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. మరో వారం పది రోజుల్లో వరి కోతలకు రానున్నది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించనున్నది. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం రూ.2060, బీ గ్రేడ్ ధాన్యం రూ.2040 ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట పెట్టుబడి వరకు రైతులకు ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడి సాయం అందించడంతోపాటు సాగునీరు సరఫరా చేయించి నిరంతరంగా విద్యుత్ అందింస్తుండడంతో భూమికి బరువయ్యేలా జిల్లాలో పంటలు పండుతున్నా యి. గతంలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు ప్రభు త్వం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం రైతులపై మెండివైఖరిని అవలంబిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలిచింది.
యాసంగిలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే..
జిల్లాలో 3,31,000 ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఈ సంఖ్య మరింత పేరిగే అవకాశం ఉంది. 221 కేంద్రాలు మహిళా సంఘాలు, 190 సహకార సంఘాలు, 5 మెప్మా ద్వారా కొనుగోలు చేస్తారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కవ రోజులు కేంద్రాల్లో ఉండకుండా, ప్రధానంగా రవాణాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోనున్నారు. తూకం అయిన వెంటనే మిల్లులకు తరలించే విధంగా రవాణాశాఖ అధికారులతో చర్చిస్తున్నారు. అవసరమైన గన్నీ బ్యా గులు, వేయింగ్ మిషన్లు, ఇతర సామగ్రిని, కేం ద్రాలకు ముందే పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి అవసరమైన సామగ్రి వచ్చిన తర్వాతనే కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈసారి ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా తాగునీటి వసతితో పాటు రైతులు, హమాలీలు విశ్రాంతి తీసుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటారు. వడదెబ్బ బారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది జిల్లా అధికార యంత్రాంగం సూచించింది.
ధాన్యాన్ని ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకురావాలి..
రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి, తేమ శాతం 17 కంటే తక్కువ ఉండే విధంగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. రైతులు తమ ఆధార్‌కార్డుకు మొబైల్ నెంబర్ లింకు చేసుకొని ఉండాలి. లేకపోతే దగ్గరలో ఉన్న పోస్టాఫీస్, మీ సేవ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కాదు. వరి పంట వివరాలు నమోదైన రైతులకు ఏఈవో వరిసాగు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. వరి సాగు ధ్రువీకరణ పత్రం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వెళ్లాలి. ధ్రువీకరణ పత్రం చూపించిన రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తారు. వరి పంట నమోదు కాని రైతులు ఏఈవో లేక ఏవో వద్ద ఓపీఎంఎస్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రికార్డు స్థాయిలో వరి సాగు
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు అన్ని మంచి రోజులు వచ్చాయి. సమైక్య రాష్ట్రంలో అరిగోస పడ్డ రైతులు స్వరాష్ట్రంలో సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. రైతులకు దన్నుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరి జలాలు జిల్లాకు తీసుకువచ్చి బీడు భూముల్లో పారించడంతో పచ్చని పంట పొలాలతో జిల్లా కోనసీమను తలపిస్తున్నది. గతంలో పది, ఇరవై బస్తాల వడ్లు పండించిన రైతులు ఇవాళ క్వింటాళ్ల కొద్ది, ట్రాక్టర్ల లోడ్లు నింపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌల భ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన నుంచి వరి సాగు విస్తీర్ణం చూస్తే గణనీయంగా పెరిగింది. 2016-17 వానకాలంలో 57,865 ఎకరాలు సాగైతే, 2022 వానకాలంలో 3,03,912 ఎకరాల్లో సాగుచేశారు. దాదా పు ఐదు రెట్లు వరిసాగు పెరిగింది.
2016 వానకాలంలో 16,613 మంది రైతులకు రూ.65.76 కోట్లు చెల్లిస్తే, అదే వానకాలం 2022లో 99,386 మంది రైతులకు రూ.782.62 కోట్లు చెల్లించింది. 2016-17 యాసంగిలో 1,06,880 ఎకరాలు సాగు చేస్తే, అదే 2021-22 యాసంగిలో 2,62,277 ఎకరాలు సాగు చేశారు. అప్పుడు 43,159 మంది రైతులకు రూ. 278.13 కోట్లు చెల్లిస్తే గత యాసంగిలో 90,714 మంది రైతులకు రూ.769.06 కోట్లు ప్రభుత్వం చెల్లింది. (2022-23 యాసంగిలో 3,31,000 ఎకరాల్లో వరి సాగైంది) ఏటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతుంది. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. అదేస్థాయిలో రైతుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నది.