కోహీర్, నవంబర్ 30: ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలతో రోగాలబారిన పడుతున్నారు. ప్రహరీ నిర్మించి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు మురుగు కాల్వ నిర్మించలేదు. దీంతో మురుగంతా అక్కడే నిల్వ ఉండడంతో ఇబ్బందులుకు గురవుతున్నామని మండలంలోని దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు.
ఎల్అండ్టీ సంస్థ ఆధ్వర్యంలో ఏడేండ్ల క్రితం 65వ జాతీయ రహదారి నిర్మించారు. పాఠశాలకు ప్రహరీని కూడా ఏర్పాటు చేయించారు. తరగతి గదులు కూడా సమీపంలో ఉండడంతో వారి కష్టాలు వర్ణణాతీతం. పలు ఇండ్లలో నుంచి వచ్చే మురుగు గ్రామం బయటకు తరలించకుండా అధికారులు చేతులెత్తేశారు. తమకేమీ పట్టనట్లు చూస్తుండిపోయారు. పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలోనే ఇలాంటి దుస్థితి ఉండడంతో ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
మురుగు తో తడిసిన గోడ ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో దోమలు, ఈగల బెడద నుంచి తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ఎల్అండ్టీ సంస్థ, విద్యా శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. జిల్లా అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
దిగ్వాల్ గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఇరువైపులా మురుగు కాల్వలను నిర్మించాలి. ఇండ్లలో వాడిన నీరంతా పాఠశాల ప్రహరీ వద్ద నిలిచి ఉండడంతో దుర్వాసన వస్తున్నది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు దుర్వాసన, ఈగలు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కార మార్గం చూపాలి.
– నారాయణరెడ్డి, దిగ్వాల్, కోహీర్