మెదక్ అర్బన్ : గంజాయి , మత్తు పదార్థాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువత గంజాయి , మత్తు పదార్థాల బారిన పడకుండా మత్తు పదార్థాల సరఫరా , ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గంజాయి ప్రదేశాలను, గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారి ద్వారా గంజాయి ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు.
గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి , వార్డు పోలీస్ అధికారి వారానికి రెండు సార్లు వారికి కేటాయించిన గ్రామాలు, వార్డులలో సందర్శించి ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుని నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లాడ్జీలు, బస్టాండ్లు , కాలేజీలు, లేబర్ అడ్డాలు, తదితర ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. లీగల్ అడ్వజైర్ రాములు, మెదక్ డీఎస్పీ సైదులు , తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ , సీఐలు , ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.