నర్సాపూర్,ఫిబ్రవరి15 : కేసీఆర్ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వృక్షోత్సవం సందర్బంగా మొక్కలు నాటడం జరిగిందని వెల్లడించారు. కేసీఆర్ తన జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడని కొనియాడారు. తెలంగాణ ప్రధాతగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.
కేసీఆర్ చల్లని నీడలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చెందాలని, ఆయన హయాంలో సాధించిన రామరాజ్యం మళ్లీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. మొక్క ఎలాగైతే దినదినాభివృద్ధి చెందుతుందో కేసీఆర్ పేరు ప్రతిష్టలు కూడా అలాగే పెరగాలని ఆకాంక్షించారు.