హత్నూర, డిసెంబర్ 26: పాలనను ప్రభుత్వం గాలికి వదిలివేయడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 37వేల ఎకరాల భూసేకరణచేసి 90శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన పదిశాతం పనులు ప్రభుత్వం చేయడం లేదన్నారు. రైతుల సంక్షేమంకోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టులు నిర్మిస్తే వారిని కేసులపేరిట భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. రెండేండ్లుగా సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చుచేసి గ్రామాల్లో పనులు చేస్తే వారికి బిల్లులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గతంలో 24గంటల కరెంట్ సరఫరాచేస్తే నేడు కేవలం 12గంటలు మాత్రమే సరఫరా చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. యాప్‌లో నమోదుచేసుకుంటేనే యూరియా సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. యాప్‌పై రైతులకు సరైన అవగాహన లేదని, ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయడానికే ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిందని మండిపడ్డారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. సింగూరు ప్రాజెక్టు కింద వరినాట్లు వేసుకోవాలా వద్దా అని చెప్పకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అనంతరం మండలంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డుసభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు శివశంకర్‌రావు, రమేశ్‌నాయక్, అర్జున్, వీరేశంగౌడ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.