సిద్దిపేట, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తున కు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్ణాలు భగ్గుమన్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పులతడక అని ఆ వర్గాలు ముక్తకంఠంతో ఖండించాయి.తెలంగాణ సాధకులు, సాగునీటి ప్రదాతలు కేసీఆర్,హరీశ్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై భగ్గుమన్నారు.
ఆరోపణలు చేయడమే లక్ష్యంగా ఘోష్ రిపోర్టు ఉందని దుయ్యబట్టారు. ఎంతసేపు బురద రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగాఉందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాస్తారాకోలు, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతృత్వంలో కాళేశ్వర జలాలు తీసుకువచ్చి సిద్దిపేటలోని అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మండల కేంద్రా ల్లో బీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేటలోని అమర వీరుల స్తూపానికి బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో జలాభిషేకం చేసి అక్కడే రాస్తారోకో చేశారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి బిందెలతో కాళేశ్వర జలాలు తీసుకువచ్చి రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొగుట మండలం మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ – ప్రజ్ఞాపూర్‌లో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాదాస్ శ్రీనివాస్ ఇతర నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో స్థానిక నేతలు రాస్తారోకోలు చేసి రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.