కౌడిపల్లి, సెప్టెంబర్ 11: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లి బస్టాండ్ వద్ద మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై లోవోల్టేజీ, యూరియా, నీటిసమస్య, సన్నవడ్లకు బోనస్‌పై వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించేందుకు వచ్చి ఎమ్మెల్యేలను పిలువకుండా మాజీలతో సమావేశాలు నిర్వహిండం ఏమిటని ప్రశ్నించారు.
నియోజకవర్గానికి రూ.3 కోట్లు ఇస్తే కనీసం తాగునీటి సమస్య తీరుతుండేదని, జిల్లాకు మొత్తం కలిపి కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ నిధులు కనీసం సరిపోవడం లేదన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎంత చిత్త ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాగునీరు, రోడ్లు, కుంటలకు నిధులు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. కౌడిపల్లి సబ్‌స్టేషన్‌లో ఉన్న 50ఎంవీఏ బూస్టర్‌ను సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు తరలించి ఇక్కడ 10/16 ఎంవీఎను పెట్టడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. లోవోల్టేజీ సమస్యతో బోరుమోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో లోవోల్టేజీ సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.
నాలుగు రోజుల నుంచి త్రిఫేజ్ కరెంట్ గంట కూడా రావడం లేదని, వర్షాలు పడుతున్నప్పటికీ కరెంటు సరిగ్గా రాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 50 ఎంవీఏ బూస్టర్‌ను కౌడిపల్లిలో బిగించి లోవోల్టేజి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ముందు 24గంటల కరెంటు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి 12 గంటల కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సకాలంలో జీలుగ, యూరియా, డీఏపీ ఎరువులు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
యూరియా బస్తా కావాలంటే రోజంతా పస్తులుండి లైన్లో నిలబడితే ఒక్క బస్తా కూడా దొరకక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. యాసంగిలో పండించిన సన్నవడ్లకు బోనస్ ఇవ్వకపోగా జిల్లా వ్యాప్తంగా రూ.32 కోట్లు బకాయి ఉందని, నియోజకవర్గంలోని రైతులకు రూ.8 కోట్లు బాకీ ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చారని, రెప్పపాటు కరెంటు పోలేదని, రైతులు బోర్లు ఆన్‌చేసి హాయిగా ఇంట్లో నిద్రపోయేవారని గుర్తుచేశారు. అనంతరం ధర్నా వద్దకు విద్యుత్ అధికారులు రాగా మెదక్ ట్రాన్స్‌కో డీఈ షేక్ చాంద్‌పాష, ట్రాన్స్‌కో డీఈ వేదాకుమార్, నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఆయా మండలాల ఏఈలకు కౌడిపల్లిలో వెంటనే 50ఎంవీఏ బూస్టర్ బిగించాలని వినతి పత్రం అందజేశారు.
దీంతో అధికారులు స్పందించి వెంటనే బిగించి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ నవీన్, దుర్గారెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్‌కుమార్, కుత్బుద్దీన్, అమర్‌సింగ్, కిశోర్‌గౌడ్, శంకర్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్, పోల నవీన్, కొండల్‌రెడ్డి, శివ, సంజీవ్, పాష, సందీప్, రామాంజనేయులు, రవిసాగర్, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.