నర్సాపూర్,జూన్16: స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు వెళ్తుంటారు. నర్సాపూర్ నుంచి జక్కపల్లి మోడల్ స్కూల్ వరకు ఉదయం మూడు బస్సులు, సాయంత్రం మూడు బస్సులు నడిచేవి. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా నడవడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఉదయం నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు.
నర్సాపూర్ నుంచి జక్కపల్లి స్కూల్ వరకు బస్సు నడిపించాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో చాలా సేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై-2 జగన్నాథం పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. డిపో మేనేజర్ సురేఖతో ఎస్సై జగన్నాథం ఫోన్లో మాట్లాడగా మంగళవారం నుంచి బస్సు సర్వీసులు నడిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా విరమించారు.