Narsapur | నర్సాపూర్, జూన్ 16: స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గతంలో మూడు బస్సులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బస్సు కూడా నడపకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తుంటారు. దీంతో నర్సాపూర్ నుంచి జక్కపల్లి మోడల్ స్కూల్ వరకు ఉదయం మూడు బస్సులు, సాయంత్రం బస్సులు నడిచేవి. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా నడపలేదు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వారు బైఠాయించి ఆందోళనకు దిగారు.
నర్సాపూర్ నుంచి మోడల్ స్కూల్ వరకు బస్సు సర్వీసులను నడిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించిన నినాదాలు చేశారు. దీంతో చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. బస్సు సౌకర్యం గురించి డిపో మేనేజర్‌ను అడిగితే.. ఈ నెల 20వ తేదీ తర్వాత వేస్తామని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్సై జగన్నాథంతో తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల అధిక డబ్బులు వెచ్చించి ఆటోల్లో వెళ్లాల్సి వస్తుందని.. డబ్బులు పెట్టలేని వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డిపో మేనేజర్‌తో ఎస్సై జగన్నాథం మాట్లాడి రేపటి నుంచే బస్సు సర్వీసులు నడిపించాలని సూచించారు. దీనికి డిపో మేనేజర్ ఒప్పుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సమ్మె విరమించారు.