రామచంద్రాపురం, ఏప్రిల్ 18: కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణాలను కూల్చి వేయిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో పేదల పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. దుకాణాలు కోల్పోయిన చిరువ్యాపారుల బాధలు ఎవరికీ పట్టడం లేదు.
కేవలం చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లపైన, రోడ్డుకు ఇరువైపులా చిన్నపాటి డబ్బాలు, షెడ్లు, తడ్కలతో ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. మా బతుకులతో ప్రభుత్వం ఆడుకుంటుంది.. సీఎం రేవంత్‌రెడ్డి పేదల పట్ల మూర్కంగా వ్యవహరిస్తున్నారని చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల దుకాణాలు కూల్చి పెద్దలకు సంబంధించిన దుకాణాలు, పెద్ద షెడ్లు, ఫుడ్‌కోర్టులు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తున్నారు.
తెల్లాపూర్ బల్దియా కార్యాలయం పక్క నుంచి బోన్సాయి అపార్ట్మెంట్స్ వరకు ఫుట్‌పాత్‌లపైన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను శనివారం పోలీస్ బందోబస్తు మధ్య బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. కూల్చివేతలను అడ్డుకున్న చిరువ్యాపారులను పోలీసులు పక్కకు జరిపారు. డబ్బాలను కూల్చివేయడంతో చిరువ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిని గమనించిన స్థానికులు పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.