సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో మంత్రి కేటీఆర్ గురువారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానంగా సిద్దిపేట ఐటీ టవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నాటి ‘ఇంటింటా తాగునీరు’ నేటి ‘మిషన్ భగీరథ’కు, అప్పటి ‘దళిత చైతన్య జ్యోతి’ ఇప్పటి ‘దళితబంధు’కు, ఒకప్పటి ‘సిద్దిపేట హరితహారం’ ఈనాటి ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాలుగా మారాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇవ్వాళ అందరూ అసూయ పడేలా సిద్దిపేటను అభివృద్ధి చేసి చూపుతున్న అద్భుతమైన నాయకుడు మంత్రి హరీశ్‌రావు అంటూ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. హరీశ్‌రావు తన బావ కాబట్టి సిరిసిల్లకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఆయనను సరదాగా ఏడిపిస్తానని, సిద్దిపేటలో అది చేస్తున్నవ్.. ఇది చేస్తున్నవ్.. ఇంతింత పెద్ద రోడ్లు వేస్తున్నావ్ అంటూ ఆట పట్టిస్తానని చలోక్తులు విసిరారు. ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుందన్నారు. అభివృద్ధి కాముకుడు హరీశ్‌రావుకు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి రికార్డులు బద్ధలు కొట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
-సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్, జూన్ 15
ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ గురువారం సిద్దిపేటలో సందడి చేశారు. పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారి పక్కన నిర్మించిన ఐటీ టవర్‌ను జిల్లా మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ర్టానికే ఆదర్శంగా మారిన స్వచ్ఛబడి, స్టీల్‌బ్యాంకు, రుతుప్రేమ వంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రుల పర్యటన ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఐటీ ఉద్యోగులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో మొదలుకొని సామాన్యుల వరకు ఆసక్తి చూపారు. ఇద్దరు డైనమిక్ మంత్రుల రాకతో అంతటా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది.
సిద్దిపేటలో స్వచ్ఛబడిని ప్రత్యక్షంగా చూసిన మంత్రి కేటీఆర్ దానికి ఫిదా అయ్యారు.ఇంతకు ముందు పేపర్లలో చూశాను. దీని గురించి చాలా విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. స్వచ్ఛబడి సూపర్బ్.. యూ ఆర్ గ్రేట్ సార్ అని మంత్రి హరీశ్‌రావును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.