నిజాంపేట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా సోమవారం అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసింది. రైతులు తడిసిన ధాన్యాన్ని నీటి నుంచి వేరు చేశారు. కోతలు ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు.
రామాయంపేట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నది. వర్షం ధాటికి పంటచేలన్నీ నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది.
కోహెడ, అక్టోబర్ 21: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపడి మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. సుమారు గంటపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసింది. అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పత్తి, వరిపంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది.
చిన్నశంకరంపేట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసింది. ఒక్కసారిగా వర్షం రావడంతో కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. చేతికి వచ్చిన పంట నేలపాలు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 21: ఆరుగాలం చేసిన కష్టం వర్షం పాలైం ది. సోమవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మారెట్ యార్డులో ధాన్యం, మొకజొన్నలు తడిసి ముద్దయ్యాయి. భారీగా వర్షం పడటంతో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం తీసుకువచ్చి నాలుగైదు రోజులైనా కొనేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
నర్సాపూర్, అక్టోబర్ 21: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే దశలో వర్షం పడటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.