మెదక్ అర్బన్,ఆగస్టు22 : భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లలో 18000 మొక్కలు నాటాలని ఆదేశించారు.
అదేవిధంగా సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఎస్పీ తెలిపారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.