మెదక్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) వంద శాతం డిజిటలైజేషన్ చేసేందుకు క్షేత్రస్థాయిలో బీఎల్వోలు కృషిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మెదక్‌లో 2,20,427 మంది, నర్సాపూర్‌లో 2,32,713 మంది ఓటర్లు ఉన్నారు.
సర్‌లో భాగంగా జిల్లాలో 586 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 4,53,140 మంది ఓటర్లు ఉండగా, బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇందులో 3,51,287 ఫారాలు డిజిటలైజేషన్ (77.52 శాతం) పూర్తి చేశారు. ఇంకా 83,794 ఫారాలు (18.49 శాతం) డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2,572 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. 1539 మంది డబుల్ ఓట్లు ఉన్నట్లు నివేదికలో వివరించారు.
మెదక్ జిల్లాలో వంద శాతం సర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ చొరవ చూపుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)సర్ ప్రక్రియను జిల్లాలో జూన్ 12న ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు చివరి తేదీ విధించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఆర్వోలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు క్షేత్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిటలైజేషన్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు 3 వరకు ఎన్నికల సంఘం గడువు ఇవ్వడంతో కలెక్టర్ ప్రతిమా సింగ్ క్షేత్ర స్ధాయిలో పర్యటించి వందశాతం పూర్తయ్యులా చొరవ తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 93,084 మంది ఓటర్లను తొలింగించేందుకు గుర్తించినట్లు తెలిసింది.