పటాన్‌చెరుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. పట్టణంలో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వరాలు ప్రకటించారు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను పొడిగిస్తామని, ఉస్మాన్‌నగర్‌లో ఐటీ పార్కు ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌కు ఆదేశాలు ఇస్తామన్నారు. అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.30కోట్లు, భారతీనగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లకు రూ.10కోట్ల చొప్పున నిధులు ఇస్తామని ప్రకటించారు. కొల్లూరులో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టౌన్షిప్లో 2వేల ఇండ్లను పటాన్‌చెరులోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లకు కేటాయిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశామని, ఈ రోజే అనుమతులు ఇస్తామన్నారు. రామచంద్రాపురం మున్సిపల్ పరిధిలోని రాయసముద్రం చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం ప్రకటనలపై సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రజల తరఫున ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషితో నియోజకవర్గం అన్నిరంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.
– పటాన్చెరు/జిన్నారం/ గుమ్మడిదల/బొల్లారం/అమీన్పూర్, జూన్ 22
తెలంగాణ అభివృద్ధి చూసి ఈ మధ్య తెలంగాణలో ఒక ఎకరా భూమి అమ్మితే ఆంధ్రలో యాభై ఎకరాలు కొనొచ్చని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏం.. మహిపాల్ పటాన్చెరులో ఎకరా ధర ఎంతుందని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేను అడిగారు. దీనిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందిస్తూ ఎకరా ధర రూ.30 కోట్లు ఉంటుందని నవ్వుతూ చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా నవ్వుతూ ఒక ఎకరా అమ్మితే యాభై ఏంటి వంద ఎకరాలే ఆంధ్రలో కొనే పరిస్థితి ఉన్నదని సీఎం చెప్పడంతో సభ చప్పట్లతో మార్మోగింది.
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు/జిన్నారం/గుమ్మడిదల/బొల్లారం/అమీన్పూర్, జూన్ 22: సంగారెడ్డి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. జిల్లా ఎంతోకాలంగా మెట్రో రైలు, ఐటీ కంపెనీల కోసం ఎదురుచూస్తున్నది. జిల్లా ప్రజల కలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ గురువారం పటాన్చెరు బహిరంగ సభలో వరాలు కురిపించారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పటాన్చెరు వరకు మెట్రో రైలు విస్తరించాలని కోరుతున్నారు.. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే అక్కడా మహేశ్వరం వరకు మెట్రో రైలు విస్తరించాలని కోరారు. ఆ సభలో మెట్రో విస్తరిస్తామని హామీ ఇచ్చానన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కారిడార్ పటాన్చెరు నుంచి దిల్సుఖ్ నగర్ అన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున పటాన్చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మలిదశలో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో రైలు వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మెట్రోను పటాన్చెరు వరకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే పటాన్చెరు వరకు మెట్రో రైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరుకు పాలిటెక్నిక్ కాలేజీ కావాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కోరారని, వెంటనే కాలేజీ మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు.
ఉస్మాన్‌నగర్‌లో ఐటీ పార్క్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌కు ఆదేశిస్తామని తెలిపారు. కొల్లూరులో ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో రెండు వేల ఇండ్లను పటాన్చెరు డివిజన్‌కు కేటాయిస్తామని సీఎం తెలిపారు. రామచంద్రాపురం మండలం రాయసముద్రం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలో రాయసముద్రం చెరువును సుందరీకరిస్తామన్నారు. ఇరిగేషన్ ద్వారా వెంటనే నిధులు మంజూరు అయ్యేలా చూడాలని వేదిక మీద ఉన్న మంత్రి హరీశ్‌రావుకు ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లు పటాన్చెరు, ఆర్సీపురం, భారతీనగర్‌కు ఒక్కో డివిజన్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.30 కోట్లు అభివృద్ధి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. మూడు మున్సిపాలిటీలు అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 కోట్లు చొప్పున రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 55 పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వినతి మేరకు త్వరలోనే పటాన్చెరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరికలను వేదికపైనే తీరుస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని మూడోసారి ఆశీర్వదించాలని వేదికపై సీఎం ప్రకటించడంతో సభ కేరింతలు, చప్పట్లతో మార్మోగింది.
పటాన్చెరులో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మెడికల్ డివైజ్ పార్కులో 15 వేల మంది పని చేస్తున్నారని తెలిసి సంతోషం అనిపించిందన్నారు. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. కొల్లూరు, ఉస్మాన్‌నగర్ ప్రాంతంలో 400 ఎకరాలు ఉన్నట్లు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చెప్పారన్నారు. అక్కడ ఐటీ కంపెనీలు వచ్చేలా చూస్తామన్నారు. ఐటీ శాఖ మంతి కేటీఆర్‌ను త్వరలోనే పటాన్చెరు పంపిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, రాములు, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీరెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ శివకుమార్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రిజ్వి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మాజీ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశంగౌడ్, శ్రీధర్‌చారి, కొలనుబాల్రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, ఈర్ల దేవానంద్, సద్ధి ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, తుమ్మల పాండు రంగారెడ్డి, కొలను రోజాబాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, వైస్ చైర్మన్లు నందారం నర్సింహగౌడ్, రాములుగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, మేరాజ్‌ఖాన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, రాజేశ్, హుస్సేన్, ఈర్ల రాజు, మాజీ కౌన్సిలర్ మోహన్‌గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అఫ్జల్ అలీ, బాల్‌రెడ్డి, గూడెం యాదమ్మ, షకీల్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్, తహసీల్దార్ పరమేశ్, దశరత్సింగ్ రాథోడ్, దశరథ్, సుజాత,ఎంపీడీవో భన్సీలాల్, రాములు, చంద్రశేఖర్, మల్లేశ్వర్ పాల్గొన్నారు.