Women Robbery | నర్సాపూర్, ఆగస్ట్ 14 : మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నర్సాపూర్ అటవీ ప్రాంతంలో 38 ఏండ్ల మహిళపై దాడి చేసి తులం బరువు కలిగిన రెండు బంగారు చెవి రింగులు దోపిడి చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ దోపిడి కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం మదుల్వాయి గ్రామానికి చెందిన గజ్జల భిక్షపతి (27) అనే వ్యక్తి మెదక్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి నర్సాపూర్ వైపు వస్తుండగా బస్సులో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. మద్యం, చేపలు, డబ్బు ఇస్తానని ప్రలోభపెట్టి నర్సాపూర్‌లో ఆమెతో కలిసి బస్సు దిగి మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులోకి జారుకున్న సదరు మహిళపై దాడి చేసి బంగారు రింగులు లాక్కొని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా నర్సాపూర్‌లోని వైన్స్ షాపులో కీలకమైన సీసీటీవీ ఆధారాలను, నిందుతుడు వేసుకున్న బట్టలు, ఆనవాళ్లకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని విచారణ బృందం స్వీకరించారు. గురువారం ఉదయం నిందితుడికి సంబంధించిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జైలు నుండి విడుదలైన రెండు రోజులకే దోపిడీ..
నిందుతుడు బిక్షపతి గతంలో పలు నేరాల్లో అరెస్ట్ కావడం జరిగిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని రెండో భార్యతో గుమ్మడిదలలో నివసిస్తున్నాడు. మద్యం, జూదం వంటి వ్యసనాలకు బానిస కావడమే కాక విలాసవంతమైన జీవనశైలికి కూడా అలవాటు పడిన భిక్షపతి ఖర్చుల నిమిత్తం ఆస్తి నేరాలకు పాల్పడ్డాడు.
నిందితుడు భిక్షపతి 2015లో మెదక్ టౌన్ పీఎస్ పరిధిలో దొంగతనం కేసులో మొదటి సారిగా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో పది ఆస్తి నేరాలు, అలాగే ఒక పోక్సో కేసులో కూడా నిందుతుడిగా ఉన్నాడు. ఇటీవల గుమ్మడిదల పీఎస్ పరిధిలో చేసిన నేరాల్లో అరెస్టై ఈ నెల 11వ తేదీన కంది జైలు నుండి విడుదలయ్యాడు. బుధవారం భిక్షపతి తన పాత కేసుల విషయంలో న్యాయవాదిని కలిసేందుకు మెదక్ వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సులో బాధితురాలితో పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
జైలు నుండి విడుదలైన రెండు రోజులకే నిందితుడు మరో దోపిడి చేయడం గమనార్హం. 24 గంటల వ్యవధిలోనే దోపిడి కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి దొంగ సొత్తును రికవరీ చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఐ లింగం, కానిస్టేబుల్ శ్రీకాంత్ బృందాన్ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించి రివార్డులు అందజేశారు.