మెదక్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమ్ముకుందని తెలిపారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి, హెడ్లైట్లు ఆన్ చేసి, ముందు వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అవసరం లేని ప్రయాణాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రహదారులపైకి రావాలని జిల్లా ప్రజలను కోరారు.
దేవాలయాల్లో పూజలు చేసిన ఎస్పీ
నూతన సంవత్సరం సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ రావు మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం, ముత్తాయి కోట స్వయంబు శివాలయన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎస్పీ కి తీర్థప్రసాదాలు అందజేశారు.