పుల్కల్, ఆగస్టు 29: సంగారెడ్డి జిల్లా సింగూ రు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో 53,075 క్యూసెక్కులు కొనసాగినట్లు సింగూరు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వద్దే ఉంటూ ఎప్పటికప్పుడు నీటి హెచ్చు తగ్గులను గమనిస్తూ నీటిని వదులుతున్నారు.
శుక్రవారం స్పిల్‌వే గేట్ల ద్వారా 59,031 క్యూసెక్కులు,జల విద్యుత్ కేంద్రం రెండు టర్బైన్ల ద్వారా 1889 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో మొత్తంగా 60920 క్యూసెక్కులు దిగువకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 18.903 టీఎంసీలు నిల్వ ఉందని, వరద ఉధృతి తగ్గే వరకు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, గొర్లకాపరులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.