పుల్కల్, ఆగస్టు 23: మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు నిండేది ఎప్పుడు మా పంటలు పండేదెలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఆగస్టు 23వ తేదీ నాటికి ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 15.222 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
ప్రాజెక్టులోని 20 టీఎంసీల నీటిమట్టం చేరితే కాని సాగుకు వదలలేని పరిస్థితి. ఈసారి తాగునీటికి తప్పా సాగుకు నీరందడం కష్టమే అనిపిస్తున్నది. సింగూ రు ప్రాజెక్టు కాలువలను నమ్ముకుని వరినాట్లు వేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఏటా కెనాల్ ద్వారా 44 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. కానీ, ఈసారి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక ప్రాజెక్టు లోకి అనుకున్నంతగా వరద రాలేదు. అడపాదడపా ముసురు వర్షాలు పడినప్పటికీ 2 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇలాగైతే మా పంటలు పండేదెలా..పంటల కోసం తెచ్చుకున్న అప్పు లు సైతం తీర్చేదెలా అంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆగస్టు చివరి వారం లేదా, సెప్టెంబర్ మొ దటి వారం వరకైనా ప్రాజెక్టులోకి సరిపడా వరద వస్తే తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు ఆశపడుతున్నా రు.సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.222 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1942 క్యూసెక్యులు, ఔట్‌ఫ్లో 391 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్యులు, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగరీథ కోసం 70 క్యూ సెక్కులు, 210 క్యూసెక్కుల నీరు వృథా అవుతున్నట్లు అధికారులు తెలిపారు.