పుల్కల్,సెప్టెంబర్ 15 : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల నుంచి ప్రాజెక్టు స్పిల్ వే 8, 9,10 నంబర్ గేట్లు 1-50 మీటర్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ నాగరాజు వెల్లడించారు. ప్రాజె క్టులోకి ఇన్ ఫ్లో 24284 క్యూసెక్కులు కొనసాగుతుండగా, స్పిల్ వే మూడు గేట్ల ద్వారా 21840 క్యూసెక్కులు, జెన్కో ద్వారా 2277 క్యూసెక్కులు,మొత్తంగా అవుట్ ఫ్లో 24777 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశామన్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలకు పస్తుతం 17.544 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరదను గమనిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లు గానే దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. నీరు దిగువకు విడుదల చేసిన సందర్భంగా గొర్ల కాపరులు,మత్స్య కారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.