సిద్దిపేట, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్లు ముందుకు వెళ్లలేని విధంగా తయారయ్యాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన కాలువలతోపాటు పంట కాలువలు సిల్టుతో పేరుకుపోయాయి. యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. దీంతో సాగునీరు ఎలా పంట పొలాలకు చేరుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
నీటి పారుదల అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఆఫీసుకే పరిమితం అవుతున్నారు తప్పా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూడడం లేదు. నీళ్లు ఇస్తే ఎలా పోతాయన్న ఆలోచన కూడా చేయడం లేదు. రైతులంతా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నా యి. సాగునీరు వస్తుందా..? రాదా..? అన్న అనుమానంలో రైతులు ఉన్నారు. సాగునీటి విడుదల చేయాలని ఇప్పటికే మాజీ మంత్రి, సిద్దిపేట, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కానీ, యాసంగి సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం, నీటి పారుదల శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పూడికతో నిండిపోయిన కాలువలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల కింద కాల్వలు పూడికతో నిండిపోయాయి. ప్రాజెక్టుల ద్వారా పొలాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముమ్మరంగా కాలువల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కాలువల్లో పూడిక, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లతోపాటు అటు సింగూరు, వనదుర్గ ప్రాజెక్టులు ఉన్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, తపాస్‌పల్లి ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. నాలుగైదేండ్ల నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం సాగునీరు అందించింది.
ప్రస్తుత యాసంగికి సాగు నీటిని విడుదల చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనట్లు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న కాలువలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ప్రతి చెరువుకూ నీళ్లు పోయేలా చేసింది. కాలువల నిర్వహణను చూసుకోవాల్సిన అధికారులు దానిని గాలికి వదిలేశారు. యాసంగి సాగుకు సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇంతవరకు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పిచ్చి మొక్కలను తొలిగించే పనులు చేపట్టడం లేదు.
ఈ విషయంలో సాగు నీటి అధికారులు తమకు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాసంగి పనులను రైతులు ప్రారంభించారు. ఈసారి యాసంగిలో సిద్దిపేట జిల్లాలో అన్ని పంటలు కలిపి 3.82 లక్షలు కాగా, వరి 3.48లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేశారు. మెదక్ జిల్లాలో అన్ని పం టలు కలిపి 2.84లక్షల ఎకరాలు కాగా, ఇం దులో వరి 2.65 లక్షల ఎకరాలు సాగు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని పంటలు కలిపి 2,01,193 ఎకరాలు అంచనా వేశారు. ఇందులో వరి సాగు లక్షా పది వేల ఎకరాలు కాగా జొన్న 59 వేల ఎకరాలు, శనగ 20 వేలు, మిగితా ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లలో గోదావరి జలాలు నిండి ఉన్నాయి. ఈ నీటిని ఎప్పుడు చెరువులు నింపుతారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ప్రధాన కాలువల్లో పూడిక నిండిపోయింది. పూడికతో నిండిపోయిన కాలువల్లో నీరు ఎలా పోతుందో నీటి పారుదల శాఖ అధికారులకే తెలియాలి. ఒకవేళ ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తే ఈ కాలువల్లో నీరు ఎలా పోతుంది అని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గతేడాది నుంచి నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. కాగితాల వరకు ఒక రిపోర్టు, క్షేత్ర స్థాయిలో మరొకటి ఉంటుంది. కాలువలు కూలిపోయి, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉన్నా అధికారులకు కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువలు బాగుచేయించాలని కోరుతున్నారు.
నీళ్లిచ్చి ఆదుకోవాలి..
యాసంగి వరి పంట వేసుకోవడానికి నీళ్లు లేక దుక్కి దున్నుతలేం. కాలువలో పిచ్చి మొక్కలు పెరిగాయి. కాలువలో సిల్టుతో నిండిపోయి నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు యాసంగి, వానకాలం పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందే నీళ్లు ఇడిచారు. సీఎం రేవంత్ పట్టించుకొని మల్లన్న సాగర్ నుంచి వాగులు, కాలువలకు నీళ్లు విడుదల చేసి యాసంగి పంటలు వేసుకోవడానికి సాయపడాలి.
-పాత్కుల రాములు, రైతు, వెంకట్రావుపేట, సిద్దిపేట జిల్లా