పటాన్చెరు, జూలై 3: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను గుర్తించారు. గురువారం సాయం త్రం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో కార్మికుల మృతదేహాల నుంచి సేకరించిన ఎముకలు, కుటుంబ సభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేశారు. చాటేలాల్కోల్, రమేశ్‌గౌడ్, దిలీప్గోసాయి. సిద్ధార్థగౌర్, శ్యామ్సుధర్తాడ, సుధాదీప్ సర్కార్, దీపక్, అజయ్ మోండల్, చైతు భట్యా, అతుల్ కుమార్ మృతదేహాలకు డీఎన్ఏ నివేదికలు మ్యాచ్ అయ్యాయి. మృతు ల కుటుంబ సభ్యులకు పటాన్చెరు సర్కారు దవాఖానలో మృతదేహాలు అప్పగించారు.
మృతిచెందిన కార్మికుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డీఎన్ఏ పరీక్షలు మ్యాచ్ కావడంతో పటాన్చెరు దవాఖానలో ఉన్న మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి బీహారు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారీగా గుర్తించారు. మృతదేహాలు మాంసం ముద్దలుగా కావడంతో ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశారు. దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేట్ వాహనాలు సిద్ధం చేశారు.
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన 31 మంది మృతదేహాలను గుర్తించారు. గురువారం పటాన్చెరు దవాఖానలో డీఎన్ఏ పరీక్షలు చేసి 13 మంది మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. లక్ష అందజేసింది. పటాన్చెరు మార్చురీలో ఏడు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కార్మికుల మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారడంతో వాటిని గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.