సిద్దిపేట కలెక్టరేట్, జూలై 8: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 499 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, సహాయ కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బందికి 10 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల్లో అధికంగా దళితులు, బలహీన వార్గలకు చెందిన పేద కార్మికులు సంవత్సరాల తరబడి పని చేస్తున్నా, ఇంతవరకు పర్మినెంట్‌కు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కలెక్టర్ సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముట్టడిలో యూనియన్ జిల్లా కార్యదర్శి మహేశ్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.