Siddipeta | సిద్దిపేట, మార్చి12 : సిద్దిపేట నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను రద్దు చేశారని.. రద్దై ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కక్షపూరితంగా రద్దు చేసి ఆపినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో బిటి రోడ్ల నిర్మాణాలకు రూ.45 కోట్లు మంజూరు చేశామని ఈ ప్రభుత్వం రాగానే ఆ రోడ్ల పనులు రద్దు చేసిందన్నారు. రద్దు చేసిన పనులకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పనులను ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన 18 బిటి రోడ్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల పక్షాన సంబంధిత మంత్రికి, ఉన్నతాధికారులకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పలుమార్లు లేఖలు రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హరీశ్‌రావు ప్రత్యేక చొరవ కృషి ఫలితంగా రద్దైన పనులకు అనుమతులు లభించాయి.
రూ.1కోటి 97లక్షలతో నిర్మించే రామంచ – చంద్లాపూర్ పిఆర్ రోడ్డు నుండి సిరిసిల్లకు అనుసంధానం చేసే రోడ్డు వరకు బిటి రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం, రూ.1 కోటి 52లక్షలతో పెద్దకోడూర్ నుండి చిన్నకోడూర్ వరకు రాజీవ్ రహదారిని కలిపే రోడ్డు నిర్మాణం, రూ.2కోట్ల 65లక్షలతో కిష్టాపూర్ ఎస్సీ కాలనీ నుంచి గుండారం వరకు రోడ్డు మీద బిటి రోడ్డు నిర్మాణం, రూ.4కోట్లతో సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు నుండి మిట్టపల్లి – మందపల్లి రోడ్డు వరకు బిటి రోడ్డు నిర్మాణం, రూ.3కోట్ల 43లక్షలతో బ్రకిచెప్యాల నుండి దర్గా దుద్దెడ వరకు రోడ్డు మీద బిటి రోడ్ నిర్మాణం, రూ.4కోట్లతో గట్లమల్యాల రోడ్డు నుండి ఆరేపల్లి మీదుగా కొండంరాజపల్లి వరకు బిటి రోడ్డును నిర్మాణం, రూ.2కోట్ల 66లక్షలతో రంగాయపల్లి నుండి తెనుగువానిపల్లి వరకు రోడ్డు మీద బిటి నిర్మాణం, రూ.1కోటి 23లక్షలతో మాచాపూర్ – రంగాయపల్లి పిఆర్ రోడ్ నుండి హాస్టల్ ద్వారా బిటి రోడ్ నిర్మాణం, రూ.2కోట్ల 44లక్షలతో రాజీవ్ రహదారి నుండి పొన్నాల పిఆర్ రోడ్డు వరకు జంతు హాస్టల్ ద్వారా బిటి రోడ్ నిర్మాణం, రూ. 2కోట్ల25 లక్షలతో చిన్నగుండవెల్లి నుండి రాంపూర్ రోడ్డు మీద బిటి నిర్మాణం, రూ.4కోట్లతో సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి నుంచి ఇర్కోడ్‌కు వెళ్లే రోడ్డులో బి.టి రోడ్ నిర్మాణం, రూ.3కోట్లతో సిద్దన్నపేట నుండి రాంపూర్‌కు రోడ్డు నిర్మాణం, రూ.3కోట్ల 60లక్షలతో సికింద్లాపూర్ నుండి శివునిపల్లి మీదుగా చెర్లఅంకిరెడ్డిపల్లికి రోడ్డు నిర్మాణం, రూ.2కోట్ల 03 లక్షలతోకస్తూరిపల్లి నుండి దర్గపల్లి రోడ్డు నిర్మాణం, రూ.2కోట్లతో 88లక్షలతో జక్కాపూర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద ఆర్ అండ్ బి రోడ్డు నుండి కోడివారి కాలనీ మీదుగా జక్కాపూర్ విఠలాపూర్ పిఆర్ రహదారి వరకు బిటి రోడ్డు నిర్మాణం, రూ.1కోటి67 లక్షలతో కాచీర్ పల్లి నుండి పిట్టలవాడ గంగాపూర్ వరకు రహదారి నిర్మాణం,రూ.1కోటితో నాగరాజుపల్లి నుండి మాచిరెడ్డిపల్లి వరకు రోడ్డు నిర్మాణం రూ.75లక్షలతోవెంకటాపూర్ నుండి అప్పలయచెరువు వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగనున్నాయి.
సిద్దన్నపేట నుండి రాంపూర్ వరకు రూ.3.20కోట్లతో రోడ్డును మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నంగునూరు మండలం సిద్దన్నపేటలో బిఆర్ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతుల చిరకాల కోరికైన రోడ్డు నిర్మాణంకు అనుమతులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, మల్లేశం, మల్లారెడ్డి, జనార్థన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సాయి.సందీప్, ఎల్లయ్య, ఆదినారాయణ, మధరెడ్డి, దీపురెడ్డి, అజయ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి,నాగరాజురెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.