నర్సాపూర్, జూలై 13: పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిఫుల్‌ఆర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామ రైతులు శనివారం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రిఫుల్‌ఆర్ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని రాస్తారోకో చేశా రు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతు లు మాట్లాడుతూ… పాత అలైన్‌మెంట్‌ను మార్చి కొత్త అలైన్‌మెంట్‌ను తేవడంతో తమకు నష్టం జరుగుతున్నదని, అలాగే సాగుభూములను తీసుకోవడం సరికాదన్నారు.
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు, కాళేశ్వరం కాలువ నిర్మా ణం కోసం భూములను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని చెరువు నుం చి ట్రిఫుల్ నిర్మాణానికి సర్వే చేపడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. గ్రామ శివారులో ఉన్న చెరువులో నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్తుందని రైతులు తెలపగా, అలాంటి ఏమి లేదన్నారు. రైతులతోపాటు ఆర్డీవో చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ఆర్ కోసం చేపట్టిన అలైన్మెంట్ మారదని, నష్టపరిహారం విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.