MLA Harish Rao | సిద్దిపేట, ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక.. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్య్రాన్ని సాధించిన పార్టీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్టీ జెండాను పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నేటితో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభ కోసం ప్రజలు ఎదురుచూస్తురన్నారు. సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన జెండా గులాబి జెండా అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేం..
సమైక్య పాలకుల అణచివేత నుండి స్వతంత్రం కల్పించిన పార్టీ అన్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్టాన్ని సాధించారన్నారు. తెలంగాణ ర్రాష్టాన్ని సాధించడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆన్నారు. పదేండ్లు తెలంగాణ ర్రాష్టాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేమన్నారు.
నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది, ఆదాయం కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుందని, సిద్దిపేట అంటే ప్రభుత్వం ఓర్వలేని పరిస్థితి ఉందన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించామన్నారు.
రూ.200 రూపాయల పెన్షన్ రూ.2000 చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి,రైతులకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ఇంటింటికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించిన బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వను రుణమాఫీ, రూ. 15,000 రైతుబంధు ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు.
ఎడ్లబండిపై, పాదయ్రాతలు చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలు విందామనే ఆసక్తితో ఉన్నారన్నారు. ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుందని, సిద్దిపేటలో పెట్టిన వెటర్నరీ కాలేజ్‌ను కొడంగల్‌కు తరలించుకుపోయారన్నారు.
శిల్పారామం పనులు పెండింగ్‌లో పెట్టారని, ఎస్సీ గురుకుల పాఠశాలకు రూ.30 కోట్లతో భవనం మంజూరు చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయారన్నారు. సిద్దిపేట అంటే ప్రభుత్వం ఓర్వలేని పరిస్థితిలో ఉందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని, అప్పుడు జరిగే అభివృద్ధిని మీరు అడ్డుకోలేరన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది. ఆదాయం మందగించి ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వంలో మంత్రులు మధ్య, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గతి లేని శృతి లేని సంసారంలాగా ఉందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతుందన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
మరోసారి బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ ర్రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు.
గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్రమంతా ఘనంగా జరుపుకుంటుందని, రాష్ట్ర ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అభిమానులు అందరికీ హృదయపూర్వక బీఆర్ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కొండం కవిత, అనగోని వినోద్, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి