Giloy | మన చుట్టూ పరిసరాల్లో తీగ జాతికి చెందిన మొక్కలను మనం చాలానే చూస్తుంటాం. అయితే వాటిల్లో కొన్ని ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా ఉంటాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి తీగ జాతికి చెందిన ఔషధ మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. కానీ దీన్ని చాలా మంది అంతగా గమనించి ఉండరు. ఈ మొక్క వెడల్పైన ఆకులను కలిగి ఉంటుంది. తీగ కాండం లావుగా ఉంటుంది. దీన్ని చాలా సులభంగా గుర్తు పట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. తిప్పతీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తిప్పతీగను ఉపయోగించి అనేక వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు.
ఒక టీస్పూన్ మోతాదులో తిప్ప తీగ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే అల్పాహారానికి 30 నిమిషాల ముందు సేవిస్తుండాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. మధుమేహం ఉన్నవారికి తిప్పతీగ ఎంతో మేలు చేస్తుంది. తిప్పతీగను మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. తిప్పతీగ ఆకులను ఎప్పటికప్పుడు సేకరించి జ్యూస్ చేసుకుని తాగితే మేలు జరుగుతుంది. తిప్పతీగ జ్యూస్‌ను అర టీస్పూన్ మోతాదులో రోజుకు 2 సార్లు భోజనం చేసిన అనంతరం ఉదయం, సాయంత్రం సేవిస్తుండాలి. దీంతో జ్వరం తగ్గుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఒళ్లు నొప్పులు తగ్గిపోయి మళ్లీ యాక్టివ్‌గా మారుతారు.
ఇన్ఫెక్షన్లు ఉన్నవారు తిప్ప తీగ జ్యూస్‌ను రోజూ తాగితే ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించే శక్తి తిప్పతీగకు ఉంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక తిప్పతీగ అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించగలదు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అంటు రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. తిప్పతీగ జ్యూస్‌ను సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోయి జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అజీర్తి ఉండదు. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంట సైతం తగ్గిపోతుంది.
తిప్పతీగ జ్యూస్‌ను పావు టీస్పూన్ మోతాదులో రోజూ రాత్రి పూట నిద్రకు ముందు సేవిస్తుండాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా తిప్పతీగ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే తిప్పతీగ మనకు ప్రకృతిలో సహజంగానే లభిస్తుంది. కనుక దీని జ్యూస్‌ను కొనాల్సిన పనిలేదు. ఈ మొక్క అందుబాటులో లేదు అనుకున్న వారు దీని జ్యూస్‌ను కొని ఉపయోగించవచ్చు. అలాగే తిప్పతీగ ఆకుల పొడి కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. తిప్పతీగ కొందరికి పడదు. అలర్జీలను కలిగిస్తుంది. అలాగే కొందరికి విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక తిప్పతీగను వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.