మంథని, ఏప్రిల్ 27: ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సాధిస్తే ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారింది తప్ప పైసాకు కూడా పనికి వస్తలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. వరంగల్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి పుట్ట మధుకర్ నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఎదురుగా పార్టీ జెండాను పుట్ట మధుకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంథని నియోజకవర్గం ప్రజలు ఒకే కుటుంబానికి అనేక సంవత్సరాలుగా పట్టం కడుతున్నా ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధిలో శూన్యంగా ఉంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు రాజ్యాంగం, మహనీయుల చరిత్ర తెలియకపోవడం వలన మనం ఇంకా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా 16 పైసల మందం కూడా పనిచేయలేదు అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధికి తట్టెడు మట్టి పోయలేదన్నారు.
వరంగల్లో జరిగే సభకు ప్రజలు తరలి వెళ్లకుండా ప్రభుత్వం, అధికారులు అనేక విధాలుగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకువచ్చి అనేక ఇబ్బందుల గురిచేసారన్నారు. అయినప్పటికీ దాదాపు 5,000 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ సోల్జర్స్, అభిమానులు, కార్యకర్తలతో సభకు తరలి వెళ్తున్నామన్నారు. అధికారులు, ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన లెక్కచేయకుండా సభకు వస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దే అధికారమని ఆయన జోష్యం చెప్పారు.