దుబ్బాక, డిసెంబర్ 30: కేసీఆర్ సర్కారులోనే గ్రామాలకు మహర్దశ నెలకొన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ.15 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తమ సొంత గ్రామం పోతారంలో పంచాయతీ భవనంతోపాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామాల్లో పంచాయతీ భవనాలతో పాటు చెత్త సేకరణకు ట్రాక్టర్లు, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కల పెంపకం చేపట్టి, వాటి సంరక్షణ కోసం నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు. దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, నాయకులు రాజమౌళి, కిషన్‌రెడ్డి, కైలాస్, కృష్ణ, శ్రీనివాస్, సిద్దిరాములు పాల్గొన్నారు.