రాయపోల్ మే 17 : పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలోని విద్యా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని
పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మర్మాముల నాగరాజు చేతుల మీదుగా అభినందించి మెమెంటోలు అందజేశారు.
ప్రథమ స్థానం సాధించిన సిహెచ్. సంపత్ (527/600), ద్వితీయ స్థానం పొందిన ఐ. యుగేందర్ (523/600), తృతీయ స్థానం దక్కించుకున్న ఎం. శృతి (522/600)లను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.