Flag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్తింది. డివిజన్ ప్రధాన కేంద్రమైన స్వతంత్ర చౌక్‌లో ప్రతీ సంవత్సరం గెలిచిన కార్పొరేటర్ ప్రజల సమక్షంలో జెండావిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర చౌక్ లో ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ భర్త తిరుపతి తన అనుచరులతో వచ్చి ఇక్కడ తామే జెండా ఎగురవేయాలని వారించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంకు దారి తీసింది. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి ఎవరికి వారుగా వేడుకలు జరుపుకోవాలని సూచించి వెళ్లగొట్టారు.
శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పంద్రాగస్టు వేడుకలకు మరెక్కడా లేనివిధంగా 51వ డివిజన్లో మాత్రమే పోలీసులు బందోబస్తు కల్పించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు అయోమయానికి లోనయ్యారు. చివరకు ఒకే చోట ప్రక్కప్రక్కనే రెండు జాతీయ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యతకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి వేడుకల్లో ఆధిపత్యం ప్రదర్శించడం, ప్రజా తీర్పుతో గెలిచిన కార్పొరేటర్ ను అవమానించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రేఖ మహేశ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను వేదికగా చేసుకొని మాజీ కార్పొరేటర్ రాజకీయం చేయడం, పైగా తన పట్ల దౌర్జన్యంకు దిగడం, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్‌గా ఇక్కడ జెండా ఎగురవేయడం అనేక యేళ్లుగా ఆనవాయితీగా వస్తోందనీ, అదే అనుసరించి ఈసారి తాను జెండా ఎగురవేశాక ఆ పక్కనే మరో జెండా ఎగురవేసి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. కాగా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఒకే దగ్గర రెండుసార్లు పంద్రాగస్టు వేడుకలు జరిగిన సంఘటనతో డివిజన్ ప్రజలు నిశ్చేష్ఠులయ్యారు. కాగా రామగుండం కార్పొరేటర్లు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించారు. పంద్రాగస్టు వేడుకల సాక్షిగా జరిగిన తాజా పరిణామం కార్పొరేషన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..