
గజ్వేల్, జూన్ 30 : గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా సీఎం ఆలోచన మేరకు గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించారన్నారు. ఇప్పటికే మూడు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి ద్వారా 98 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రస్తుత పల్లె ప్రగతితో గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదని, ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడంతో పాటు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నారు. నాలుగేండ్ల నుంచి రాష్ట్రంలో డయేరియా, సీజనల్ వ్యాధులు రాలేదని ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమం ముగిసే వరకు అన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోటుపాట్లుంటే అన్ని పూర్తి చేయాలని, 10 రోజుల తర్వాత తిరిగి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. పల్లెలు, పట్టణాల మాదిరిగానే పదెకరాల్లో మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని, 10 రోజుల్లో స్థల పరిశీలన పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించాలన్నారు.
సర్పంచ్ గ్రామ చరిత్రలో నిలుస్తారు..
ఈసారి గెలిచిన సర్పంచ్ ఎంతో అదృష్టవంతులని, వారి పేరు గ్రామచరిత్రలో నిలిచిపోతుందని మంత్రి హరీశ్ అన్నారు. గ్రామంలో పల్లెప్రకృతి వనాలు, నర్సరీ, వైకుంఠధామాలు, డంపింగ్ ఏర్పాటు చేశారని, ప్రజలంతా సర్పంచులను తరతరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో 80 జీపీలకే ట్రాక్టర్లుండేవని, ఇప్పుడు 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్ 12,769 గ్రామాలకు గాను 19,298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు.
తూతూ మంత్రంగా చేయొద్దు..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తూతూ మంత్రంగా పని చేయొద్దని, పటిష్టంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తమ బాధ్యతలు, అధికారుల గురించి వివరించామని, వారి పరిధిలోని అన్ని అధికారాలు వినియోగించుకుని గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణాల్లో చైర్మన్లు, కమిషనర్లు కూడా వార్డుల్లో ప్రగతి పనులను పటిష్టంగా చేయాలన్నారు. అధికారులెవరూ సెలవులు పెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి జిల్లాలోని గ్రామాలన్నీంటిని రాష్ర్టానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
నెలనెలా నిధులు..
గతంలో ఏడాదికోసారి నిధులు వచ్చేవని, ఇప్పుడు నేరుగా సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ల ఖాతాలకు నెలనెలా నిధులు జమ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ కింద చేసిన పనులకు సంబంధించి ఆన్ నమోదు చేసిన పూర్తి బిల్లులను చెల్లించామన్నారు. పనులు పూర్తయినా, బిల్లులను అప్ చేయకుండా సర్పంచ్ పీఆర్ ఏఈలు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే పీఆర్ ఎంపీడీవోలు, ఎంపీవోలు బిల్లులను ఆన్ అప్ చేయాలని, 3వ తేదీలోగా అన్ని బిల్లులు మంజూరు చేస్తామన్నారు. పల్లె ప్రగతి పూర్తయ్యేలోపు అన్ని గ్రామాల్లో డంపింగ్ వైకుంఠధామాలు తదితర పనులను పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా వచ్చి ఏ గ్రామాన్నైనా తనిఖీ చేయవచ్చని ఈ సందర్భంగా అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు.
కార్యదర్శులకు పే స్కేల్ వేతనాలకు
సీఎం కేసీఆర్ సుముఖత..
పంచాయతీ కార్యదర్శులకు రెండేండ్లు రెగ్యులరైజ్ సమ యం ఉన్నా, గత ఏప్రిల్ నుంచే పేస్కేల్ వేతనాలు చెల్లించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుపడంతో కార్యదర్శులంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ జీవో జారీ చేసి పేస్కేలు ప్రకారంగా వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు పొందుతున్నాం..
సిద్దిపేట జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోయేవని, సరైన పంటలు గతంలో పండలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఈ యాసంగిలో 4లక్షల90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని మంత్రి హరీశ్ వెల్లడించారు. రైతులు ఇక నుంచి దొడ్డురకం ధాన్యం పండిస్తే కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేదని, వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించాలని సూచించారు. జిల్లాలో 50వేల ఎకరాల్లో సాగు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి హరీశ్ వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు లక్షాధికారులు కావొచ్చన్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఆయిల్ సాగు వరి కన్నా మూడు రెట్లు లాభాన్ని అందిస్తుందన్నారు. అలాగే, పట్టుపురుగుల పరిశ్రమ తదితర పంటల వైపు రైతులు దృష్టి సారించి ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. సిద్దిపేటలో పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆయిల్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు కూడా సాగు చేసి రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
పల్లె ప్రకృతిలో భేష్..
పల్లె ప్రకృతి నిర్వహణలో మర్కూక్, మల్యాల, మిట్టపల్లి గ్రామాలు చాలా బాగున్నాయని, రెడ్యానాయక్ తండా, బెజ్జంకి ఎక్స్ గొల్లపల్లి గ్రామాల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. మండలాల వారీగా మర్కూక్, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్ మండలాలు బాగున్నాయని, కోహెడ, మద్దూర్, రాయపోల్ మండలాల్లో పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం చేస్తూ వెనుకంజలో ఉన్నారన్నారు.
కరోనాతో ప్రజల్లో చాలా మార్పువచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ అన్నారు. ప్రకృతి రక్షించుకోవాలంటే ప్రతిఒక్కరూ మొక్క నాటాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న హరితహారంలో వేల సంఖ్యలో మొక్క లు నాటుతుండడం సంతోషంగా అనిపిస్తున్నదని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. దేశంలోనే అత్యధికంగా మొక్క లు నాటిన రాష్ట్రం తెలంగాణనే అని ఎఫ్ చైర్మన్ వంటేరు ప్రతాప్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో సమిష్టిగా కృషి చేసి జిల్లాను ముందుస్థానంలో ఉంచాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ అన్నారు. గ్రామాల్లో డంపింగ్ పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీల నిర్మాణాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసినందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజామ్మిల్ అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాలారావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ సుడా చైర్మన్ రవీందర్ గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్ జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ ఎంపీటీసీలు, ఎంపీడీవో, ఎం పీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాల్వలు, చెరువు గట్లపై మొక్కలు నాటండి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్
సీఎం కేసీఆర్ సంకల్పించిన హరితహారం విజయవంతం కావాలంటే సమిష్టిగా కృషి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ అన్నారు. చెరువులు, సాగునీటి కాల్వలకు రెండువైపులా మొక్కలు నాటాలని, దీంతో కట్టలు కూడా దృఢంగా మారడమే కాకుండా పచ్చదనాన్ని మరింత పెంచవచ్చన్నారు.
అభివృద్ధికి సూచనలివ్వాలి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
గ్రామాల అభివృద్ధికి నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో అం దరూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పించిన గ్రామాల అభివృద్ధిలో ప్రజలు కూడా పాలుపంచుకుంటేనే సం పూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలంతా మెరుగైన జీవితాన్ని అనుభవించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.