రుద్రంపూర్, ఫిబ్రవరి 09 : కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ రాజ్ కుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి డిస్పెన్సరీలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.పరశురాములు నుండి అత్యవసర వైద్య సేవలు సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన సదుపాయాలపై సమాచారం తీసుకున్నారు. అత్యవసర సేవలకు కావాల్సిన మౌలిక వసతులు, పరికరాలను త్వరితగతిన సమకూర్చేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
అనంతరం డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును, ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. అలాగే ఫిజియోథెరపీ యూనిట్‌ను పరిశీలించిన ఆయన, యూనిట్‌ను త్వరలో పూర్తి చేసి, ఫిజియోథెరపీ సేవలను ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.