వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Accident) ఇద్దరు దుర్మరణం చెందారు. ఓ కుటుంబం అన్నారం షరీఫ్ దర్గాలో కందూరు చేసుకొని తిరిగి ట్రాక్టర్ ( Tractor ) లో వస్తుండగా తీగరాజుపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో అందులో ఉన్న చిన్నారితో పాటు డ్రైవర్( Driver ) మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.
ట్రాక్టర్ డ్రైవర్ మద్యంమత్తులో అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా, ట్రాక్టర్లో 12 మంది ఉన్నట్లు తెలిపారు. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.