Harish Rao | సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి ( రచ్చ బండ ) వద్ద గ్రామ వృద్ధులతో గురువారం నాడు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వారు అసంతృప్తి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామస్తులు మాజీ మంత్రి హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు, కరెంట్ కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు.
రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానంటే నమ్మి ఓట్లేసాం. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రూ. 200 ఉన్న పెన్షన్ ను రూ. 2000 చేశారు. రేవంత్ రూ. 4000 అని ఆశపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఒక్క రూపాయి పెంచలేదు. కేసీఆర్ ఇచ్చిన రూ. 2000 కూడా ఇప్పుడు సరిగ్గా ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్లు రావడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వయసు తగ్గించి మరీ పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్లకు, వయసు మళ్లిన వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు.
రైతుబంధు కూడా అందరికీ వేయడం లేదు. మూడు ఎకరాలు ఉన్నోళ్లకు, రెండు ఎకరాలు ఉన్నోళ్లకు కోతలు పెడుతున్నారు. రుణమాఫీ కూడా కొందరికే అయ్యింది. లక్ష రూపాయలలోపు ఉన్నోళ్లకు కూడా ఇంకా కాలేదు. షరతుల వల్ల మాఫీ రావడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్..
మీరు (బీఆర్ఎస్) ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. రాత్రి పూట బావుల కాడికి పోయి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మోటార్లు కాలిపోతున్నాయి. సాయంత్రం 5:30 అయితే కరెంట్ పోతోంది. కేసీఆర్ ఉన్నప్పుడు.. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నోట్లో బువ్వ తిన్నట్లు ఉండేది… ఇప్పుడు కరెంట్ కోసం ఎదురుచూపులే సరిపోతున్నాయి.
ఎరువుల కోసం మళ్ళీ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఒక్కసారి పోతే ఒక బస్తానే ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా దొరికేవి. బతుకమ్మ చీరలు బంద్ చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.. అది లేదు. ఉన్నవి పోయాయి.. కొత్తవి రావడం లేదు. బస్సుల్లో ఆడవాళ్లకు ఫ్రీ అన్నారు.. కానీ పురుషులకు టికెట్ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి.
కెసిఆర్ ఉన్నప్పుడు అన్ని బాగుండే…!*
పెంచన్ కొత్తది ఇస్తలేడు.. పాతది పెంచుతాలేడు…
కెసిఆర్ ఇచ్చిన 2వేల పెన్షనే వస్తుంది..
రైతు బందు ఏగొట్టిండు. రైతు ఋణమాఫీ సగమే చేసిండు…
కెసిఆర్ ఉన్నప్పుడు కరెంట్ 24 ఉండే.. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్త లేదు…!!… pic.twitter.com/cEUIPSrMhE
— Office of Harish Rao (@HarishRaoOffice) January 15, 2026
గ్రామస్తుల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు వారికి ధైర్యం చెప్పారు. ” మీ బాధ నాకర్థమైంది. మీ సమస్యలపై నేను ప్రభుత్వాన్ని నిలదీస్తాను. అసెంబ్లీలో నేను మీ తరఫున కొట్లాడుతాను. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడతాను. మీరు అడిగిన బోర్లకు సంబంధించి ఈ నెలలోనే టెండర్ పూర్తవుతుంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. నెల రోజుల్లో పనులు మొదలుపెట్టేలా చూస్తాను.” అని స్పష్టం చేశారు.