తొగుట, ఫిబ్రవరి 28 : కరువు నేలలో గోదావరి జలాలు ప్రవహించడం సంతోషంగా ఉందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ అన్నారు. ఎక్కడో ఉన్న గోదారమ్మను ఇక్కడికి తీసుకురావడం సీఎం కేసీఆర్ చరిత్రలో అపర భగీరథుడిగా నిలిచిపోయారన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి జడ్పీ చైర్ పర్సన్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎక్కడో ఉన్న గోదావరిని ఇక్కడికి తరలించడం మాములు విషయం కాదన్నారు. మూడేండ్లలో రిజర్వాయర్‌ను నిర్మించడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, మంత్రి హరీశ్‌రావు అంకితభావం, ముంపు గ్రామాల ప్రజల త్యా గాలు, ఇంజినీర్లు, కార్మికుల ఫలితమేనన్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు.
దేశ ప్రజలు ఆశీర్వదించాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ దేశ్‌కీ నేతగా అవతరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చూసి ప్రతిపక్ష నాయకులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల అనితా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు సుతారి రమేశ్, మంగ నర్సింహులు, వెంకటేశ్ ఉన్నారు. మల్లన్నసాగర్‌లోకి వెళ్తున్న జలాలను చూసి సంబురపడ్డ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ తన సతీమణి జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు..