రామచంద్రాపురం, ఫిబ్రవరి 19: బస్తీ ల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. శనివారం ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, భారతీనగర్ డివిజన్లోని బొంబాయికాలనీ, ఎల్‌ఐజీలో ఏర్పా టు చేసిన బస్తీ దవాఖానలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకుముందు ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువుని ఆయన సందర్శించారు. అనంతరం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వాసులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై 453 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బల్దియా పరిధిలో ఇప్పటివరకు 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. బస్తీ దవాఖానలో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్లర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. దవాఖానలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అన్ని రాష్ట్రల్లో బస్తీ దవాఖానలు పెట్టాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందన్నారు. టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా మీరు రక్తం ఇస్తే, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్‌కు అందుతుందని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
బస్తీ దవాఖానల సేవలు వినియోగించుకోండి..
హైదరాబాద్ పరిధిలోని 256 బస్తీ దవాఖానల ద్వారా సగటున ప్రతిరోజు 2.50 లక్షల మందికి ఉచిత వైద్యం అందుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పటాన్చెరులో ఇప్పటికే మూడు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామని, ఈరోజు మరో మూడు బస్తీ దవాఖానలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఇక మందులు లేవు అనే సమస్యే ఉండదని, అన్నిరకాల మందులు ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటివరకు కరోనా సేవలు అందించిన గచ్చిబౌలి టీమ్స్ దవాఖాన ఇకమీదట అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుందన్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానలో మాదిరిగా టీమ్స్‌లో గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు పేదలకు ఉచితంగా చేస్తారన్నారు.
రూ.7,280 కోట్లతో ‘మన ఊరు-మన బడి’..
కార్పొరేట్ విద్యాసంస్థల్లో అందే విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7,280 కోట్లతో 12 రకాల సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు. బొంబాయి కాలనీలోని పాఠశాలను తొలి విడుతగా అభివృద్ధి చేస్తామన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ తరహా ఇంగ్లిష్ మాధ్యమంలో విద్య అందిస్తామన్నారు.
మాట ఇచ్చాం.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిలబెట్టుకున్నాం..
బల్దియా ఎన్నికల సమయంలో ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వాసులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని మాట ఇచ్చాం. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉంటారో అంతే ఆనందం ఈరోజు ఫెన్సింగ్ ఏరియా వాసుల కండ్లలో కన్పిస్తుందన్నారు. వారికి ఇండ్ల పట్టాలు ఇస్తుంటే ఆనందం కలుగుతుందన్నారు. దేవుడిదయ, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పట్టాలు ఇవ్వడం సాధ్యమైందన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 కారణంగా ఫెన్సింగ్ ఏరియాలో ఇండ్లు కోల్పోయిన 218 మందికి కొల్లూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం చేతుల మీదుగా ఇప్పిస్తామన్నారు. జీవో 58, 59 ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో 5వేల మందికి ఇప్పటికే పట్టాలిచ్చామని, మరోమారు ఈ జీవో ద్వారా పట్టాలు ఇచ్చే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. మార్చి 31 వరకు గడువు ఉన్నదని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతకుముందు కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందిస్తూ బొంబాయికాలనీలో త్వరలోనే ఫంక్షన్‌హాల్ నిర్మిస్తామన్నారు. ఎల్ఐజీ మీదిగా ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా అధికారులకు సూచనలు చేస్తామన్నారు. భారతీనగర్‌లో 1500 మందికి ఆసరా పింఛన్లను త్వరలో మంజూరు చేస్తామన్నారు. కార్పొరేటర్ పుష్పానగేశ్ కోరిక మేరకు రాయసముద్రం చెరువుని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, తహసీల్దార్ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ విశ్వేశ్వర్, ఆర్ఐ శ్రీకాంత్, వీఆర్వో రాజమల్లేశం, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, ఆర్సీపురం, భారతీనగర్ అధ్యక్షులు ఆలూరి గోవింద్, బూన్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, ప్రమోద్‌గౌడ్, నర్సింహ, మోహన్‌గౌడ్, ఖదీర్, గఫార్, కుతుబుద్దీన్, అంజయ్య, వెంకట్‌రెడ్డి, ఐలేశ్, రాణి, ప్రీతిగౌడ్, కృష్ణమూర్తిచారి, బేకుయాదయ్య, కృష్ణ, పాపయ్య, గిరి, మక్బూల్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.