సిద్దిపేట, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్‌ను ప్రతి క్రీడాకారుడు రోల్‌మోడల్‌గా తీసుకొని ఆల్ రౌండర్లుగా ఎదుగాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని సిద్దిపేట మినీ స్టేడియంలో ‘సీఎం కేసీఆర్ ట్రోఫీ-2022’ సీజన్ -2ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సినీ హీరో అక్కినేని అఖిల్, క్రీడాకారుడు చాముండేశ్వరీనాథ్, హెచ్‌సీఏ ప్రతినిధులు వంకా ప్రతాప్, ఎండీ ఫయాజ్, జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. పోటీల ప్రారంభం సందర్భంగా స్టేడియానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, అక్కినేని అఖిల్, చాముండేశ్వరీనాథ్లకు క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. పటాకుల మోతలు, క్రీడాకారులు, అభిమానుల ఈలలు, చప్పట్లతో స్టేడియం మార్మోగింది. మంత్రి హరీశ్‌రావు, అక్కినేని అఖిల్‌లు క్రికెట్ ఆడి క్రీడాకారులను, అభిమానులను అలరించారు. క్రికెట్ పోటీల లోగోను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే కేకును మంత్రి హరీశ్‌రావు, అఖిల్‌లు కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని అదే ఆత్మ విశ్వాసంతో పోరాడి ఒక్కడే బయలుదేరి తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రజల ఆకాంక్ష నెరవేర్చారన్నారు.
కేసీఆర్ స్ఫూర్తితో ప్రతీ క్రీడాకారుడు నేను రంజికి, ఇండియాకు ఆడాలని కలలు కని ఆ దిశగా కృషి చేయాలన్నారు. ఇదే గ్రౌండ్లో ఆడిన అబ్రార్, అఫ్రిదీ రంజీకి సెలక్ట్ అయ్యారన్నారు. మంచి క్రీడాకారులను సిద్దిపేట నుంచి రాష్ర్టానికి, దేశానికి అందించాలన్నదే తన ఆశయమన్నారు. టీ-20 జూనియర్ లీగల్‌లో అఖిల్ సిద్దిపేట జట్టు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పడం సంతోషకరమన్నారు. హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళ్తున్నదని, ఎడ్యుకేషనల్, స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే టీ – 20 లీగ్‌లో సిద్దిపేట జట్టుకు ఆడుతానని అందరూ బాగా ఆడాలని సూచించారు. చాముండేళ్వరీనాథ్ మాట్లాడుతూ ఇంటర్ డిస్ట్రిక్ టీ -20 లీగ్‌ను ఇక్కడే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టోర్నమెంట్ నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, ప్రజాప్రతినిధులు రాగుల సారయ్య, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీహరిగౌడ్తో పాటు నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.