సిద్దిపేట,ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మల్లన్నసాగర్‌ను ఈ నెల 23న జాతి కి అంకితం చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను గురువారం టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఈఎన్సీ హరిరాం, పోలీస్ కమిషనర్ శ్వేతతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రాంత ప్రజ ల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. ఈ రిజర్వాయర్‌ను తానే రూపకల్పన చేసి, పర్యవేక్షించి, ప్రారంభిస్తున్న గొప్ప సందర్భం సీఎం కేసీఆర్‌కే చెందుతుందన్నారు. 50 టీఎంసీల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ నుంచి మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో హెలిప్యాడ్‌ను తొలుత మంత్రి పరిశీలించారు. హెలికాప్టర్ దిగేందుకు ఇప్పటికే హెలిప్యాడ్ ఉండగా, నిర్మాణంలో ఉన్న మరో హెలిప్యాడ్‌ను వెంట నే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పంపుహౌస్‌ను సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఆ వెంటనే డెలివరీ సిస్టర్న్‌ను సందర్శించారు. జలాశయాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
అనంతరం ప్రాజెక్టు బయట డెలివరీ సిస్టర్న్ కింది భాగంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని, క్లోజ్డ్ మ్యానర్‌లో సమావేశం ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సాఫీగా జరిగేలా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలమని సీపీకి మంత్రి సూచించారు. అవసరమైన చోట బారికేడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు. వాహనాల మూమెంట్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు వేరువేరుగా భోజనాలను ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం అక్కడే అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, శిక్షణ కలెక్టర్ ప్రపుల్దేశాయి, ఆర్డీవో అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.