-వర్గల్, ఫిబ్రవరి 6: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గుంటిపల్లి సబ్బండ కులవృత్తుల గ్రామం. పాడి పశువులు, గొర్రె, మేకల పెంపకం, వ్యవసాయం, కూరగాయల సాగుతో పాటు గ్రామంలో పెద్ద మొత్తంలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. వీరి జీవనాధారం చేపలవేట. ఒకప్పు డు గుంటిపల్లి బెస్తొళ్ల శాపలంటే కమ్మని రుచికి పెట్టింది పేరు. అదే గ్రామానికి చెందిన పూస పోషవ్వ 40 ఏండ్ల నుంచి ఒట్టిశాపల బ్యారమే నమ్ముకొని ఊరూరా అంగడికి తిరుగుతూ పొట్టపోసుకుంటున్నది. పొద్దున్నే నెత్తిన శాపల సంచిమూట ఎత్తుకొని ములుగు, వర్గల్తో పాటు దగ్గరలో ఏ ఊరులో అంగడైతే ఆ ఊరుకు వెళ్తుంది. ఎలా ఉన్నావు! పోషవ్వ అంటే చాలు కడుపునిండా మాటలే నోటి నుంచి వస్తాయి. కండ్లల్లో బాధ.. చేతల్లో నిస్తేజం లేకుండా ఒకరికి ఎదురుచూడకుండా ఒంటరి మహిళలు, సాటి వృద్ధురాళ్లకు ఆదర్శంగా బతుకుతున్నది.
అంగడి వృద్ధురాలికి ఆదెరువు అయ్యింది. కులవృత్తి నుంచి వచ్చిన అలవాటు బతుకుకు బాట చూపింది. మెట్టింటివాళ్లు కాదన్నా.. పుట్టింటివాళ్లు చేరదీసి నీడనిచ్చారు. కూలీనాలి చేసుకుంటూ ఏ ఊరులో అంగడి సాగితే ఆ ఊరుకు వెళ్తూ తోబుట్టువుల వద్ద బతుకుతున్నది. ఆరుపదులు దాటినా కూడా ఊతకర్ర సాయంతో చేతిన ఒట్టిశాపల సంచి మూట పట్టుకొని కాలిన నడకన అంగడికి బయలు దేరుతుంది గుంటిపల్లి గ్రామానికి చెందిన పూస పోషవ్వ. 40 ఏండ్ల కింద తన కులవృత్తి చేపల వేటలో భాగంగా ఆరబెట్టిన (ఒట్టిశాపలు)చిన్న శాపలే తన నిత్యజీవనానికి ఆసరాగా ఎంచుకుంది. అయినవాళ్లు అందరూ ఉండి కూడా అనాథాశ్రమాల్లో కాలంగడుపుతున్న వృద్ధులకు రెక్కలుంటే తనకాళ్ల తాను ఎలా నిలబడాలో నేర్పుతున్న పూస పోషవ్వపై కథనం.
సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న పింఛన్ ధైర్యమిచ్చింది..
శాపల్లో పుట్టి శాపల్లో పెరిగినదాన్ని. దేవుడిచ్చిన రెక్కలు సల్లంగుంటే సచ్చేదాకా ఏదో ఒకటి చేసుకొని బతుకాలి. ఎవరిపై ఆధారడొద్దు. పైసలుంటేనే పపంచం అంతా సుట్టాలు. పైసలేని ముఖం పాడుముఖం అంటుండె మా తాతలు. ఊరూరుకు అంగడి పోయి ఒట్టిశాపలమ్ముకొని బతుకుతున్న. అంగడి జీవితానికి తోడు.. సీఎం కేసీఆర్ సారు అందిస్తున్న నెలనెలా పింఛన్ తోడయ్యింది. దీంతో ఎవ్వరికి చేయి సాపకుండా బతుకుతున్న. సారు ఇస్తున్న పింఛన్ బతికున్నంత వరకు నాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది.
-పూస పోషవ్వ, గుంటిపల్లి, వర్గల్ మండలం